చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్…
ఈ నలుగురూ చిత్రసీమకు నాలుగు మూల స్థంభాలు. ఆ తరవాతి తరంలోని మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, చరణ్.. వీళ్లంతా ఎవరికీ అందనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొన్నారు. రికార్డులు బద్దలు కొట్టే సినిమాలు తీస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ దాటి, గ్లోబల్ స్టార్లు అయిపోయారు. ఇవన్నీ.. సరేసరి. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా… చిరు, నాగ్, బాలయ్య, వెంకీ చిత్రసీమకు చేసిన కాంట్రిబ్యూషన్ మర్చిపోలేం. ఇప్పటికే.. యువ హీరోలకు వీళ్లే ఆదర్శనం. చిత్రసీమ దృష్టిని తమ వైపుకు తిప్పుకోగల సినిమాలు తీసే సత్తా వీళ్లకు ఇంకా ఉంది. కాకపోతే ఇప్పుడు ఒక్కటే సవాల్! తమ వయసుకి తగిన పాత్రల్ని పోషించడం.
చిరు వయసు 67 ఏళ్లు. అంటే షష్టిపూర్తి దాటేసింది. ఆయన మనవళ్లు, మనవాళ్లతో ఆడుకొంటున్నారు. తన వారసుడు చరణ్ విజయాల్ని చూసి పొంగిపోతున్నారు. తాను బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు. అయితే.. ఇది వరకటిలా పాటలు, డాన్సులు, కమర్షియల్ ఎలిమెంట్స్ అని పట్టుకొని కూర్చుంటే కుదరదు. ఈ విషయాన్ని భోళా శంకర్ రుజువు చేసింది. చిరు అనే కాదు, వయసు పైబడిన ఏ హీరో అయినా హీరోయిన్లతో డ్యూయెట్లు పాడుకొంటూ, రొమాన్స్ చేస్తానంటే చూడడానికి ఎవరూ సిద్దంగా లేరు. వెంకటేష్ లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దృశ్యంలో సినిమాల్లో ఇద్దరు పిల్లలకు తండ్రిగా, మధ్య వయస్కుడిగా కనిపించారు. నారప్పలోనూ అంతే! అయితే ఇవి రెండూ రీమేక్ సినిమాలు. మాతృకలో ఉన్న ఫార్ములానే పాటించారు. కథకు పిల్లల తండ్రిగా కనిపించడం అత్యవసరం. అందుకే ఆ విషయాలు ఫాలో అవ్వక తప్పలేదు. స్ట్రయిట్ సినిమాలో సైతం ఇంతే బరువైన పాత్రని పోషిస్తారా? ఆ అవకాశం వస్తే వెంకీ ఒప్పుకొంటారా? అనేది చూడాలి. సైంధవలో వెంకీ మధ్య వయస్కుడి పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి.
వయసు పై బడుతున్నా కాస్త గ్లామర్‌గా కనిపించే హీరో.. నాగార్జున. అలాగని ఇప్పటికీ మన్మథుడిగానే కనిపించాలంటే కుదరదు. ఆయన ఇంట్లోంచి ఇద్దరు హీరోలు (నాగచైతన్య, అఖిల్) వచ్చారు. రొమాంటిక్ కథలు ఎంచుకొనే ఛాన్స్ వాళ్లకు వదిలేయాలి. మన హీరోలు మరీ లవ్ స్టోరీలు చేయకపోయినా, ఇప్పటికీ పెళ్లికాని బ్రహ్మచారి పాత్రల్లోనే కనిపించాలని ఆరాటపడడం కాస్త ఇబ్బందికి గురి చేసే విషయం. ఈ విషయంలో మన హీరోలు `జైలర్`లో రజనీకాంత్ పాత్రని స్ఫూర్తిగా తీసేఉకొంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. జైలర్‌లో రజనీ తాతగా కనిపించాడు. ఆ ధైర్యం మన వాళ్లు చేయగలరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఈమధ్య తమ్మరెడ్డి భరద్వాజా ఇదే విషయమై స్పందిస్తూ.. అమీర్‌ఖాన్ ని ఉదహరించారు. దంగల్ లాంటి సినిమాల్లో అమీర్ పెద్ద పొట్టేసుకొని కనిపించాడని, అయినా ఫ్యాన్స్ చూశారని, మన హీరోలూ ఇలాంటి రిస్కులు చేయాలని సూచన చేశారు. అది ముమ్మాటికీ కరెక్టే. ఫ్యాన్స్ ఏమనుకొంటారో, వాళ్లు చూస్తారో లేదో అనే భయాలు హీరోలకు ఏమాత్రం అవసరం లేదు. ఎందుకంటే వాళ్లు మారిపోయి చాలా కాలం అయ్యింది. ఓటీటీల పుణ్యమా అని ప్రపంచ సినిమా వాళ్ల కళ్ల ముందు ఉంది. పాటలూ, డాన్సులు, హీరోయిజాలే సినిమా అనే భ్రమల్లోంచి వాళ్లు బయటకు వచ్చేశారు. ఇక హీరోలే రావాలి. ముఖ్యంగా సీరియర్ హీరోల్లో మార్పు కనిపించాలి. అలా జరిగితే.. తెలుగులో మరిన్ని గొప్ప సినిమాలొస్తాయి.