తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు ఇంకా ఏడాది ఉన్న సమయంలోనే హఠాత్తుగా బీజేపీ పాచికలు వేసింది. అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుంది. ఇప్పుడు కూటములు ఏలే తమిళనాడులో విజయ్ ఒంటరిగా మిగిలిపోయారు. కాంగ్రెస్, డీఎంకే ఓ కూటమిగా ఉండగా.. బీజేపీ, అన్నాడీఎంకే మరో కూటమి అయ్యాయి. విజయ్ మాత్రం ఒంటరిగా మారారు. ఈ పరిణామం ఆయనకు సరికొత్త సవాళ్లను తీసుకు రానుంది.
టీవీకేతో పొత్తుకు ఆసక్తి చూపిన పళనిస్వామి
తమిళ స్టార్ హీరో విజయ్ ..టీవీకే పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది అన్నాడీఎంకేతో పొత్తులు పెట్టుకుంటారని అనుకున్నారు. విజయ్ కూడా డీఎంకేనే తన శత్రువుగా ప్రకటించుకున్నారు. అన్నా డీఎంకేను పల్లెత్తు మాట అనేవారు కాదు. ఇప్పటి వరకూ ఆయన అన్నా డీఎంకే పై రాజకీయంగా విమర్శలు చేయలేదు. విజయ్ కు స్ట్రాటజిస్టుగా వచ్చిన ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే ఫార్ములా ప్రతిపాదించాడన్న ప్రచారం జరిగింది. అన్నాడీఎంకేతో పొత్తు అంటే దున్నిపారేయవచ్చని సలహా ఇచ్చారని.. ఆయన స్వయంగా పళనిస్వామితో మాట్లాడారన్న ప్రచారం జరిగింది. తర్వాత పళనిస్వామి కూడా ఆ దిశగా పార్టీ కార్యకర్తలతో, నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు. కానీ బీజేపీ రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది.
అన్నామలైను త్యాగం చేసి మరీ అన్నా డీఎంకేను దగ్గర చేసుకున్న బీజేపీ
నాలుగేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీ చేసిన తర్వాత అన్నాడీఎంకే స్థానాన్ని పొందడానికి అన్నామలై ద్వారా బీజేపీ చాలా ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అన్నామలై జయలలితపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ పుట్టి ముంచడానికి కుట్ర చేస్తున్నారని పళనిస్వామికి అర్థం కావడంతో ఆయన కూటమి నుంచి బయటకు వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేశారు. దాంతో ఒక్క సీటు కూడా రాలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఎంట్రీతో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే.. వచ్చే ఫలితాలు పరువు తీయడం ఖాయం. అందుకే పొత్తులు ఉండాల్సిందేనని డిసైడయ్యారు. బీజేపీ ప్రేమిస్తే ఇతరులు ప్రేమించక తప్పని పరిస్థితి దేశంలో ఉంది. అయితే పళనిస్వామి అన్నామలైను మాత్రమే బలి చేయాలని తమ షరతు పెట్టి సాధించుకున్నారు. ఇప్పుడు పొత్తు ఖరారు అయిపోయింది.
ఒంటరి పోరుతో విజయ్‌కు గెలుపు కష్టం !
తమిళ రాజకీయాల్లో కూటములదే ఆధిపత్యం. ప్రధాన పార్టీలుగా డీఎంకే, అన్నాడీఎంకే ఉంటాయి కానీ ఆ పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు చాలా చిన్ని పార్టీలు రెడీగా ఉంటాయి. ఒంటరిగా ఓ పార్టీ గెలవడం దాదాపుగా అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ ఒంటరిగా నిలబడ్డారు. తమిళనాడు సామాజిక రాజకీయాలను పరిశీలిస్తే.. మైనార్టీ ఓట్లపైనే ఆయన ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు. తన పేరు జోసెఫ్ విజయ్ అని ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు. క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు, దళిత వర్గాలపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ వర్గాల్లో యువత సినీ పరంగా విజయ్ను అభిమానించినా రాజకీయ పరంగా కాంగ్రెస్, డీఎంకేలను వదిలి విజయ్ కు మద్దతు పలుకుతారా అన్నది సందేహం.
చురుగ్గా వ్యవహరించలేకపోయిన విజయ్
విజయ్ డీఎంకేను ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించుకున్నారు. అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ బీజేపీ వైపు నుంచి వచ్చే ముప్పును ఊహించలేకపోయారు. రాజకీయాల్లో సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడం కీలకం. విజయ్ ఇలాంటి విషయాల్లో ఇంకా తన సమర్థతను నిరూపించుకోలేకపోయారు. ఆయన సినీ స్టార్ కాబట్టి ఎక్కడికి వెళ్లినా జనం వస్తారు. కానీ అది ఆయన రాజకీయ ఆదరణకు కొలమానం కాదు. అందుకే ఇప్పుడు ఆయన అసలైన సవాల్ ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.