రాజధాని తరలింపు బిల్లులను మళ్లీ అసెంబ్లీలో పెట్టడంపై.. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతకు ముందు ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. అక్కడ ఆలస్యం అవుతూండటంతో.. సుప్రీంను ఆశ్రయించారు. అలాగే అంతకు ముందే.. మొదటి సారి పెట్టిన బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపినా… మండలి కార్యదర్శి తొక్కి పెట్టారని.. మండలి చైర్మన్ ఆదేశాలను అమలు చేయడం లేదంటూ.. మరో పిటిషన్ కూడా వేశారు. దానిపై హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఆ పిటిషన్పై విచారణ జరగాల్సి ఉంది. అయితే.. ఈ లోపు.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలింపునకు రంగం సిద్ధం అయిందంటూ.. కొత్త ప్రచారం ప్రారంభమవడం… రాజకీయవర్గాల్లో కొత్త సందేహాలకు కారణం అయ్యాయి.
నిజంగానే ప్రభుత్వం వైపు నుంచి.. ఆ పనులు ప్రారంభమయ్యాయని అంటున్నారు. చట్ట పరిధిలో ఉందని.. ఆ పనులన్నీ పూర్తయిన తర్వాతే తరలిస్తామని.. ప్రభుత్వం .. హైకోర్టుకు చెప్పింది. ఇప్పుడు.. ఆ చట్టపరమైన పనులు పూర్తయ్యాయని అనిపించుకోవడానికి అన్ని రకాల పనులు పూర్తి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు రెండవ సారి శాసన మండలిలో పెట్టారు. దాన్ని తిరస్కరించలేదు.. ఆమోదించలేదు. అంటే.. రాజ్యంగం ప్రకారం నెలరోజుల తర్వాత ఆమోదం పొందినట్లే అవుతుందనే వాదనను ప్రభుత్వం తెరపైకి తీసుకు వచ్చింది. మండలి లో రెండవ సారి ప్రవేశపెడితే ఆ బిల్లు మండలి తిరస్కరించిన, సవరణలు ప్రతిపాదించిన 30రోజుల్లో బిల్లు పాస్ అయినట్టే భావించాలని రాజ్యాంగంలో ఉంది. ఈ నిబంధననను ఉపయోగించుకుని.. బిల్లు పాసయిందని.. గవర్నర్తో సంతకం పెట్టించుకునే ఆలోచన చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.
అయితే.. ఇక్కడే అసలు సమస్య ఉంది. మొదటగా పెట్టిన బిల్లు శాసనమండలిలోనే ఉంది. దాన్ని తిరస్కరించడమో.. ఆమోదించడమో చేస్తే…రెండో సారి పెట్టొచ్చు. కానీ ఇప్పుడు… ఒకే అంశంపై రెండు బిల్లులు మండలిలో ఉన్నట్లుగా అవుతాయి. ఒకటి సెలక్ట్ కమిటీకి వెళ్లాల్సి ఉంది. పైగా న్యాయస్థానంలో ఉంది. ఇన్ని క్లిష్టమైన విషయాల మధ్య కూడా.. ప్రభుత్వం… ఆ బిల్లుల ఆమోదం పొందాయనే అంశానికే కట్టుబడి… ముందుకెళ్లాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే… మళ్లీ రాజధాని తరలింపు వార్తలు తెరపైకి వస్తున్నాయంటున్నారు.