ఫోన్ ట్యాపింగ్‌పై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లుగా ప్రెస్ మీట్ పెట్టి లేఖ విడుదల చేయగానే.. ఆయన ఫోన్లో మాట్లాడిన మిత్రుడ్ని వైసీపీ మీడియా ముందు ప్రవేశ పెట్టింది. ఆయన పేరు రామ శివారెడ్డి. తమ ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. తానే రికార్డింగ్ చేశానని..అది ఓ కాంట్రాక్టర్‌కు షేర్ అయిందన్నారు. అక్కడ్నుంచి ఇంటలిజెన్స్ చీఫ్ కు వెళ్లి ఉండవచ్చన్నారు. ఇంటలిజెన్స్ చీఫ్ కే ఎందుకు వెళ్లింది..? ఆయన కోటంరెడ్డికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని ఎందుకు హెచ్చరించారు ?. అసలు ఈ ఇష్యూ ప్రారంభమైన ఇంత కాలం తర్వాత అదీ కూడా అమిత్ షాకు ఫిర్యాదు చేసిన తర్వాత ఎందుకు తెరపైకి వచ్చారన్న ప్రశ్నలకు మాత్రం రామశివారెడ్డి సమాధానం ఇవ్వలేదు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై దుమారం రేగినప్పుడే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లంకా రామశివారెడ్డితోనే అది ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ అని చెప్పిస్తామని ప్రకటించారు. ఇది జరిగిన దాదాపుగా వారం రోజుల తర్వాత .. కోటంరెడ్డి మిత్రుడు మీడియా ముందుకు వచ్చి అది ట్యాపింగ్ కాదని.. రికార్డింగేనని ప్రకటించారు. కోటంరెడ్డి చెప్పినట్టు తనది ఐ ఫోన్ కాదని, ఆండ్రాయిడ్ ఫోన్ మాత్రమేనని చెప్పారు. అందులోనూ ఆటోమేటిక్ గా రికార్డ్ అయ్యే అవకాశం ఉండటంతో ఆరోజు ఆ కాల్ రికార్డ్ అయిందని చెప్పారు. తన ఫోన్లో ఆటోమేటిగ్గా ఫోన్ కాల్ రికార్డ్ అవుతుందని.. కావాలంటే తన ఫోన్ ను కేంద్ర హోంశాఖ, సైబర్ క్రైమ్‌కి ఇస్తానని చెప్పుకొచ్చారు.
తన వెనుక ఎవరూ లేరని, రాష్ట్ర ప్రభుత్వం దోషిగా నిలబడటం ఇష్టం లేకనే స్వచ్ఛందంగా వచ్చి నిజం చెబుతున్నానని రామశివారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ వివాదానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే తాను తెరపైకొచ్చానన్నారు. అయితే ఈయనను మీడియా ముందుకు తెస్తామని గతంలోనే బాలినేని ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం తానే స్వచ్చందంగా వచ్చానని చెబుతున్నారు. మొత్తంగా.. ఓ తప్పు చేయలేదని చెప్పించడానికి తప్పు మీద తప్పు చేస్తున్నారన్న అభిప్రాయం సామాన్యుల్లో ఇలాంటి వాటి వల్లనే కలుగుతోంది.విచారణ జరిపించడానికి ప్రభుత్వం వెనుకడుగు వేయడం.. ఇలా స్టేట్మెంట్లు ఇప్పిస్తూండటంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.