వైసీపీలో కొత్త పంచాయితీ మొదలైందా? నెల్లూరు జిల్లాలో రెడ్లు వర్సెస్ బీసీ వార్ షురూ అయిందా..? రెండు పర్యాయాలు వైసీపీకి ఏకపక్ష విజయం అందించిన జిల్లాలో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరగడానికి ఆ బీసీ నేతే కారణమా? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు.
సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరులో వైసీపీ వైట్ వాష్ కావడానికి అనిల్ కుమార్ యాదవ్ కారణమని ఆ పార్టీకి చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు జగన్ ప్రాధాన్యత ఇవ్వడంతో లెక్కలేని తనంతో ప్రవర్తించి జిల్లాలో సీనియర్ నేతలను సైతం అగౌరవపరిచారని బహిరంగానే వ్యాఖ్యానించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను టార్గెట్ చేసుకొని అనుచితంగా వ్యవహరించాడని,అనిల్ తీరు నచ్చకే వారంతా అప్పట్లో పార్టీని వీడారన్న టాక్ నడిచింది.
ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వైసీపీకి పిల్లర్ గా పని చేసిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ప్రశాంతి రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. జగన్ కూడా అనిల్ కు పూర్తి మద్దతుగా ఉండటంతో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడారు. ఆయనతోపాటు క్యాడర్ ను అంతా టీడీపీలోకి తీసుకెళ్ళి వైసీపీ పునాదులను కదిలించాడు. ఎన్నికల సమయంలో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్యను రాజమాత అనడం తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అనిల్ వ్యవహారశైలిపై ఆగ్రహించింది.
వైసీపీని ఆదరిస్తుందని నమ్మిన రెడ్డి సామాజిక వర్గం అప్పటి పరిణామాలతో ఎన్నికల్లో కూటమి వైపు మొగ్గు చూపిందని , అదే జిల్లాలో వైసీపీ పతనానికి దారి తీసిందని తాజాగా పిన్నెల్లిని జగన్ పరామర్శించిన అనంతరం ఓ మాజీ ఎమ్మెల్యే అనిల్ తో వాదనకు దిగినట్లుగా తెలుస్తోంది. మరి ఈ వివాదానికి ఇంతటితో ఎండ్ కార్డ్ పడుతుందా.? లేదంటే కంటిన్యూ అవుతుందా..? చూడాలి.