అధికార తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు మొన్నీమధ్య టిడిపిలో చేరారు. సబ్బం హరి, కొణతాల రామకృష్ణ లాంటి వాళ్లు త్వరలో పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా త్వరలోనే తెలుగుదేశం పార్టీ లోకి చేరే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.
కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఈ మధ్య, 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయంతో విభేదించారు. అలా చేస్తే పార్టీకి భవిష్యత్తు ఉండదని వాదించిన కోట్ల, సమావేశం నుండి అర్థాంతరంగా బయటికి వచ్చారు. అయితే అధిష్టానం తరపున అహ్మద్ పటేల్, ఆంటోనీ తదితరులు కోట్ల తో మాట్లాడి, బుజ్జగించి, రాహుల్ గాంధీ తో మాట్లాడింపచేసే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. దీంతో, కోట్ల ఇంకొంత కాలం వేచి చూసే ధోరణిని అవలంబిస్తారని అంతా అనుకున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ఏమంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తో సంప్రదించారని, త్వరలోనే చంద్రబాబుతో కోట్ల భేటీ కానున్నారు అని.
అలాగే మరొక కాంగ్రెస్ నేత డిఎల్ రవీంద్రారెడ్డి ఒకప్పుడు వెలుగు వెలిగిన నేత. కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ మీద ఎంపీగా పోటీచేసి డిపాజిట్లు కోల్పోయిన అనంతరం నుండి ఆయన హవా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఈయన కూడా తన రాజకీయ జీవితాన్ని పునరుద్ధరించుకునే పనిలో ఉన్నారు. అయితే ,అందుతున్న సమాచారం మేరకు, డి.ఎల్.రవీంద్రారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సన్నాహాలు ప్రారంభించారు.
ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే త్వరలోనే కోట్ల, డిఎల్ రవీంద్రారెడ్డి ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.