కేంద్ర ప్రభుత్వంపైన బిజెపిపైన దూకుడుగా మాట్లాడవద్దని తాజాగా జరిగిన సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హితబోధ చేశారు. బిజెపి వద్దంటున్నా పట్టుకుని వేళ్లాడటం వన్‌సైడ్ ప్రేమలా వుందని ఇరు పార్టీలలో కొందరంటున్నారు. ఎపిలో టిడిపితో పొత్తు వల్ల మన అస్తిత్వానికే నష్టం వస్తున్నట్టు తాము జాతీయ నాయకత్వానికి నివేదించామని బిజెపి రాష్ట్ర నాయకులొకరు వెల్లడించారు. వారితో వున్నా లేకున్నా వచ్చే నాలుగైదు సీట్టు వస్తాయని బిజెపి భావిస్తున్నదట. జిల్లాల్లో తమకు గౌరవం లేదనీ తమ మాట ఒక్కటైనా వినడం లేదని బిజెపి ఫిర్యాదుగా వుంది. కార్యక్రమాల్లో కేంద్రం వాటా వున్నా ఎక్కడా తమ పేరే చెప్పడం లేదని ప్రధాని ఫోటో కూడా అన్ని కార్యాలయాల్లో కనిపించడం లేదని బిజెపి నేతలు అగ్గిబుగ్గవుతున్నారు. మేము వారితో పొత్తు వద్దని చెబుతున్నా చంద్రబాబు ఎలాగో ఢిల్లీ నాయకులను మేనేజిచేసి కొనసాగిస్తున్నారని కూడా వారు కోపంగా వున్నారు. ఆదివారం నాడు టీవీ9 మురళీకృష్ణ ఎన్కౌంటర్లో బిజెపి నేత సోము వీర్రాజు దాదాపు టిడిపిపై నిప్పులు కక్కుతూ మాట్లాడారు. మమ్ముల్ను బెదిరిస్తారా అంటే మమ్ముల్ను బెదిరిస్తారా అని సవాళ్లు విసిరారు. మిత్రపక్షంగా వున్నా తమను తాము బలపర్చుకోవడం కోసం అవతలివారిని బలహీనపర్చడం సహజ పరిణామమని నిర్ధారించారు. మీ ప్రశ్నలకు నేనేమీ దడదడలాడనంటూ ఘర్షణ భాషలో మాట్టాడితే అయితే రాష్ట్ర ప్రజలను దడదడలాడిస్తారా అని మురళి కూడా అంతే తీవ్రంగా మాట్లాడ్డంతో వేడివేడిగా మారింది. సోమవారం కలిసిన టిడిపి నాయకులు ఈ ఇంటర్వ్యూపై చాలా కోపం ప్రకటించారు. మా చర్చ తర్వాత మాతో వున్న బిజెపి నాయకుడు పొత్తు వద్దని రాసేశామని చెప్పారు. అంటే చాలా నాటకమే నడుస్తుందన్నమాట. ఈ లోగా విజయవాడలో వామపక్ష నాయకులు మధు రామకృష్ణలు రాష్ట్రానికిచ్చిన హామీలు నెరవేర్చని కేంద్ర ప్రభుత్వంలోంచి టిడిపి బయిటకు వచ్చేయాలని కోరారు.