టాలీవుడ్ నటుల సంఘం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ “మా” వ్యవహారాలు మరోసారి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కొన్నాళ్ల కిందట.. “మా” ఎన్నికల చాలా పెద్ద రచ్చ జరిగి.. ఇండస్ట్రీలో రెండు వర్గాలున్నాయని అందరికీ తెలిసేలా చేసింది. ఆ తర్వాత అంతా సైలెంటయినా.. ఇప్పుడు మళ్లీ కొత్త వివాదం రాజుకుంది. ఈ సారి నిధుల దుర్వినియోగం విషయంలో “మా” కార్యవర్గంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టిన శివాజీరాజా, శ్రీకాంత్, పరుచూరి వెంకటేశ్వరరావు తమపై వచ్చిన ఆరోపణలై ఘాటుగా స్పందించారు. “మా” అధ్యక్షుడైన శివాజీరాజా అసోసియేషన్ లో ఐదు పైసలు దుర్వినియోగమైన నా ఆస్తంతా రాసిచ్చేస్తా చాలెంజ్ చేసేశారు. వేడుకల ద్వారా వచ్చే డబ్బులతో మా అసోసియేషన్ కు శాశ్వత భవనం నిర్మించాలన్నదే మా అందరి లక్ష్యమన్నారు.
అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కావాలనే కొందరు మాపై ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి ఒప్పందం ప్రకారమే డబ్బు వసూలైందని ట్రెజర్ పరిచూరి వెంకటేశ్వర్ రావు స్పష్టం చేశారు. మా అసోసియేషన్ లో నిధుల దుర్వినియోగం చేశారని నిరూపిస్తే శాశ్వతంగా అసోసియేషన్ నుంచి తప్పుకుంటానని హీరో శ్రీకాంత్ మరింత ఆవేశంగా స్పందించారు. నిజానికి ఈ వివాదం అంతా.. కొద్ది రోజుల కిందట… అమెరికాలో జరిగిన “మా” సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించినది. “మా” కు సొంత భవనం నిర్మాణం కోసం.. చిరంజీవితో… అమెరికాలో వేడుకలు నిర్వహించారు. ఆ ఈవెంట్‌ను నిర్వహించడానికి ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. అయితే అప్పుడు.. ఏపీలో ప్రత్యేకహోదా ఉద్యమం ఓ స్థాయిలో ఉంది. ఆ సెగ అమెరికాలో వేడుకలపై కూడా పడినట్లు ప్రచారం జరిగింది. పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పుకున్నారు. ఆ ఈవెంట్ కు వచ్చిన నిధుల్లో చాలా గోల్ మాల్ జరిగిందని మా కార్యవర్గంలో కొంత మంది కొద్ది రోజుల నుంచి ఆరోపణలు చేయడం ప్రారంభించారు.
శివాజీరాజా, ఏడిద శ్రీరామ్ ఇద్దరూ కలిసి పెద్ద మొత్తంలో ఫండ్స్ గోల్ మాల్ చేశారని..గత వారం.. నరేష్ రాజేంద్రప్రసాద్ ఆరోపణలు చేశారు. నరేష్ అకౌంట్ పుస్తకాలన్నీ చెక్ చేశారు. గోల్ మాల్ నిజమేనని చెప్పి.. అత్యవసరంగా.. ఎగ్జిక్యూటివ్ కమిటీని సమవేశ పరిచారు కూడా. ఆ సమావేశంలో నరేష్, శివాజీరాజా వాగ్వాదానికి దిగారు. అసభ్యంగా తిట్టుకున్నారని కూడా ప్రచారం జరిగింది. దానికి కొనసాగింపుగా.. ఇప్పుడు తప్పేమీ లేదని.. చెప్పుకునేందుకు శివాజీ రాజా వర్గం వాదనలు ప్రారంభించింది. సభ్యులు అతి స్వల్పమే అయినా “మా” ఉండే రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. త్వరలో మరోసారి “మా” కార్యవర్గానికి ఎన్నికలు జరగనున్న నేపధ్యంలోనే తెరపైకి తెచ్చారని..ఓ వర్గం ఆరోపిస్తోంది. ఎన్ని కుట్రలు చేసినా.. “మా” కు సొంత భవనాన్ని నిర్మిస్తామంటున్నారు. ఈ విషయంలో మరోసారి పెద్దలు కలుగజేసుకుని రాజీచేసుకోమని.. సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనని టాలీవుడ్లో టెన్షన్ ప్రారంభమయింది.