తన తొలి రాజకీయ యాత్రకు ముందు కరీం నగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజన్నను సందర్శించాలని నిర్ణయించుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ కొత్త తరహా చర్చకు కారణమైనారు. ఎపిలో కాకుండా తెలంగాణను ఎందుకు ఎంచుకున్నారంటే ఆయన సెంటిమెంటల్ కారణాలు చెప్పారు.కాని టిఆర్ఎస్తో రహస్య అవగాహన వుండటం వల్లనే పవన్ ఇక్కడ ప్రవేశిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పవన్ తెలంగాణ వ్యతిరేకి అని కూడా వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్ ఈ ఆరోపణలను కొట్టి పారేయడానికి ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. అంటే పవన్‌ను తమతో ముడిపెట్టే కథనాలను వెంటనే ఖండించడం అవసరమని భావించారన్నమాట. అయితే ఆయనను వ్యతిరేకిగా గాక జనాదరణ గల సినిమా నటుడుగానే అభివర్ణించారు.కొండగట్టు నుంచి ప్రారంభిస్తున్నందుకు శుభాకాంక్షలు చెప్పారు. పవన్‌కు సంబంధించి ఇది మంచి పరిణామమే. అయితే ఆయన మద్య మధ్యలో వచ్చి పోయే నట నాయకుడని తన వల్ల లాభం నష్టం ఏమీ వుండవని కర్నె వ్యాఖ్యానించారు. అంతకంటే కీలకమేమంటే కెసిఆర్‌తో పవన్ కలిసింది అజ్ఞాతవాసి చిత్రం అయిదు షోల అనుమతి కోసమే తప్ప రాజకీయాలు కోసం కాదని వున్న మాట చెప్పేశారు.అయితే ఆయన కలిసినప్పుడు మాత్రం అధికార మీడియా బాగానే ప్రచారం చేసుకుంది. ఇతర విషయాలు కూడా వచ్చాయి. పవన్ కొన్ని కితాబులిచ్చారు కూడా. ఇప్పుడు అవన్నీ తీసేసి కేవలం సినిమా కోసమేనని అది కూడా కెసిఆర్ హామీ ఇవ్వకుండా సంబంధిత మంత్రి దగ్గరకు పంపించారని కర్నె చెబుతున్నారు. పవన్ కలిసింది ఆ చిత్రం కోసమేనని మీడియాలోనూ రాజకీయ పార్టీల్లోనూ చాలా మందికి తెలుసు గాని ఇలా చెప్పడం ఇబ్బందే. ఏదైతేనం ఇద్దరు ప్రభాకర్‌ల కారణంగా అసలు సంగతి బయిటకొచ్చిందన్నమాట.