ఏపీలో కొత్త కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. పాలనా వికేంద్రీకరణ అని చెబుతున్నా.. ఆయన అన్నీ విశాఖలో కేంద్రీకరిస్తున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేశారు. వాటి కార్యాలయాలను చెరో రాష్ట్రానికి కేటాయించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏపీకి.. గోదావరి రివర్ బోర్డ్ తెలంగాణకు కేటాయించారు. ఇంకా హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు సాగుతున్నాయి.
విజయవాడలో కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి 2018లోనే ఆమోదం తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ తీసుకున్న తరవాత ఏపీ ప్రభుత్వం విశాఖలో పెట్టాలని కేంద్రం కోరింది. అయితే కృష్ణా బేసిన దాటి మూడు వందల కిలోమీటర్ల అవతల కృష్ణాబోర్డు ఏర్పాటు చేయడంపై రాయలసీమ మేధావులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో కాకపోతే కర్నూలు, శ్రీశైలంలో పెట్టాలన్న వాదనను వైసీపీ అభిమాన మేధావి మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి తెరపైకి తెచ్చారు. అన్నీ విశాఖలో పెట్టడం ేమిటని వారి వాదన.
మరో వైపు తిరుపతిలో హైకోర్టు పెట్టాలనే డిమాండ్లు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. అక్కడి న్యాయవాదులు ప్రదర్శనలు ప్రారంభించారు. కర్నూలు కన్నా హైకోర్టు .. తిరుపతికే ప్రయోజనకరమని వాదిస్తున్నారు. రేపు అనంతపురం నుంచి.. తరవాత కడప నుంచి కూడా ఇలాంటి డిమాండ్లు వచ్చే అవకాశం ఉంది. అంతా రాజకీయం. ఇది ప్రజలకు ఎలా మేలు చేస్తుందో మరి !