తెలంగాణలో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాహుల్ తో కలిసి ప్రచారం చేస్తారనే కథనాలు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ తోపాటు కొన్ని నియోజక వర్గాల్లో రాహుల్ తో కలిసి భారీ ర్యాలీలో చంద్రబాబు పాల్గొనేందుకు వస్తారనే ధీమాను కూడా టీటీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, మహా కూటమి తరఫున చంద్రబాబు నాయుడు ప్రచారంపై కాంగ్రెస్ కొద్దిమంది నేతలు కొన్ని భిన్నాభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నట్టు తెలుస్తోంది..!
తెలంగాణలో రాహుల్, సోనియా గాంధీలతో సభలను కాంగ్రెస్ ప్లాన్ చేసుకుంది. తెలంగాణ ఇచ్చింది తామేనంటూ సోనియా గాంధీ సభలో భారీ ఎత్తున మరోసారి ఇక్కడి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. రాష్ట్రం ఇవ్వడం అనే అంశం కాంగ్రెస్ కి చాలా బాగా కలిసొచ్చే ప్రచారాస్త్రం అవుతుందని పార్టీ భావిస్తోంది. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు… టీడీపీ అధినేతను ప్రచారంలోకి తీసుకుని రావడం ద్వారా… దాని ప్రభావం కాస్త తగ్గుతుందేమో అంటూ కొద్దిమంది నేతల మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇంకోటి.. తెరాస ప్రస్తుతం సెంటిమెంట్ మీదే విమర్శలు చేస్తోంది. ఆంధ్రా వాళ్ల పెత్తనమనీ, మహా కూటమి గెలిస్తే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే చంద్రబాబు చేతిలోకి అధికారం వెళ్లిపోతుందనే తీరుగా ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రా అనే ఫీలింగ్ ను మరోసారి రెచ్చగొట్టి లబ్ధిపొందే ప్రయత్నంలో అధికార పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి కొంత ఇబ్బందికి గురి చేసినట్టు అవుతుందనే అభిప్రాయమూ కాంగ్రెస్ నేతల మధ్య చర్చనీయాంశంగా ఉన్నట్టు సమాచారం.
అయితే, జాతీయ స్థాయిలో భాజపాకి వ్యతిరేకంగా లోక్ సభ ఎన్నికల కోసం ఏర్పడబోయే కూటమికి పునాదిగా చంద్రబాబు, రాహుల్ గాంధీ ర్యాలీకి ప్రాధాన్యత ఉంటుందనే అభిప్రాయాలూ బలంగా ఉన్నాయి. కొన్ని జాతీయ మీడియా సంస్థల్లో కూడా ఈ కోణం నుంచే రాహుల్, చంద్రబాబులు కలిసి చేసే ప్రచారాన్ని చూస్తున్నాయి. ఇక, టీడీపీ శ్రేణుల నుంచి ఉన్న సమాచారం ఏంటంటే… మహా కూటమి ప్రచారానికి చంద్రబాబు వస్తారనే అంటున్నారు. రాహుల్ తో కలిసి తెలంగాణలో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.