రెండు కొత్త జిల్లాలు, వికారాబాద్ ను చార్మినార్ జోన్ లో కలపడం సాధ్యం కాదని… తెలంగాణ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ పంపిన ఫైల్ ను వెనక్కి పంపింది. తెలంగాణ మందస్తు ఎన్నికల్లో.. రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు చార్మినార్ జోన్ లో వికారాబాద్ ను కలుపుతామని కేసీఆర్ హామీలు ఇచ్చారు. రెండోసారి అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరిలో నారాయణపూర్, ములుగు జిల్లాలను ప్రకటించారు. కలెక్టర్లు, ఎస్పీలను నియమించారు. ఈ రెండు జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చితేనే పరిపూర్ణం అయినట్లు. అలా చేస్తేనే కొత్త జోనల్ వ్యవస్థలో పరిగణనలోకి వస్తాయి.
కొత్త జిల్లాలుగా అమలులోకి రాగానే వీటిని కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలని కోరుతూ కేంద్ర హోం శాఖకు ప్రతిపాదనలు పంపారు. కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ సవరణ ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపి సవరణ కోరాలి. సవరణ ప్రతిపాదనలు కేంద్రానికి చేరి ఎనిమిది నెలలయింది. ఇప్పుడు.. అలా చేయడం సాధ్యం కాదని ఫైల్ వెనక్కి పంపారు. ఆర్టికల్ 371 కి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఉత్తర్వులున్నాయని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం కోర్టుకు వెళ్లడంతో కోర్ట్ స్టే విధించింది. ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధ్యం కాదని… జిల్లా పరిషత్తు ఉపాధ్యాయులను, ప్రభుత్యోపాధ్యాయులను ఒకే నిబంధన కిందకు తేవడం కుదరదని ప్రభుత్వ టీచర్లు కోర్టు లో కేసు వేశారు. ఈ కేసు ఉన్నందున… అది తేలే వరకు రాష్ట్ర పతి ఉత్తర్వులు అమలు చేయడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది.
ముందస్తు ఎన్నికలకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జోనల్ వ్యవస్థ రద్దు చేస్తూ తెలంగాణా ప్రభుత్వం తీసుకొచ్చిన జోనల్ విధానానికి ఆఘమేఘాల మీద నెల రోజుల్లోనే రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. నిజానికి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది సవరణపైనే. చిన్న, చిన్న సవరణలు వెంట, వెంటనే అయిపోతుంటాయి. కానీ కేంద్రం మాత్రం కొర్రీలు పెడుతోంది. కేంద్రంతో కొద్ది రోజులుగా.. తెలంగాణ సర్కార్ సంబంధాలు అంత గొప్పగా లేవు. ఈ కారణంగానే…. ఆమోద ముద్రపడటం లేదన్న ప్రచారం జరుగుతోంది.