ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరు నూరైనా ఉగాది నుంచే కొత్త జిల్లాలు ఏర్పడాలని అధికారులను ఆదేశించారు. ఉగాది నుంచే కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉందని దానికి సంబంధించిన సన్నాహాలు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. ప్రస్తుతమున్న కలెక్టర్లు, ఎస్పీలకు కొత్త జిల్లాల బాధ్యతలు అప్పగించాలన్నారు. వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని సీఎం చెబుతున్నారు.
ఏప్రిల్ రెండో తేదీన ఉగాది. అంటే గట్టిగా నెలన్నర కూడా లేదు. ఇంకా జిల్లాలపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు. పై పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. కడపలో రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అనంతపురం జిల్లాలో పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. దీంతో హిందూపురంలో ఆందోళనలు మొదలయ్యాయి. అన్ని సదుపాయాలు ఉన్న హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు ఉద్యమిస్తున్నాయి.
ఎలా లేదన్నా తుది నోటిఫికేషన్ ఇచ్చే సరికి ఈ నెలాఖరు అవుతుంది. ఆ తర్వాత భవనాలు.. ఇతర మౌలిక సదుపాయాలు నెలలో సమకూర్చుకోవాలి. అదేమంత చిన్న విషయం కాదు. కానీ సీఎం జగన్ జరగాల్సిదేనని అంటున్నారు. కేవలం జిల్లాల సరిహద్దులు మార్చేసి పాలన ప్రారంభిస్తే పని కాదు.. పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడుతుంది. అయినా సీఎంజగన్ మాత్రం ముందుగానే అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే అది ప్రభుత్వానికే నష్టం కలిగిస్తుంది.