కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించామని కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించడంతో.. ఎక్కడెక్కడ ఏ జిల్లా వస్తుంది అన్న చర్చలు ప్రారంభమయ్యాయి. గతంలో తెలంగాణలో జిల్లాల ఏర్పాటు సమయంలో జరిగిన రచ్చ ఇంకా కళ్ల ముందు ఉంది కాబట్టి.. ఇక ఆ పంచాయతీ ప్రారంభమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ.. కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడల్లా సాధ్యమయ్యే పని కాదు. కొత్తగా జనాభా లెక్కలను కేంద్రం తీసుకోవాల్సి ఉంది. దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రకారం.. జనగణన పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న గ్రామం, మండలం, రెవెన్యూ డివిజన్, జిల్లాల సరిహద్దులను కదిలించడానికి వీల్లేదు.
ఈ మేరకు భౌగోళిక సరిహద్దులు మార్చడానికి వీల్లేదంటూ రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ జారీ చేసిన ఫ్రీజ్ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నాయి. లెక్క ప్రకారం.. జనాభా లెక్కలు పూర్తయి.. వాటి ఫలితాల నోటిఫికేషన్ విడుదల చేసే వరకు ఫ్రీజ్ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. పదేళ్లకోసారి ఈ జన గణన జరుగుతుంది కాబట్టి.. లైట్ తీసుకోవడానికి లేదు. జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్లోనూ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. పార్లమెంటరీ నియోజకవర్గానికో జిల్లాను ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారసభల్లో జగన్ హామీ ఇచ్చారు. దాని ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవిన్యూ శాఖ ద్వారా కొంత కసరత్తు నిర్వహించారు.
కానీ అనేకానేక అనుమానాలు.. సందేహాలు వచ్చాయి. పలు డిమాండ్లు కూడా తెరపైకి రావడం ప్రారంభించాయి. అదే సమయంలో… కేంద్రం నుంచి జనాభా లెక్కల కారణంగా ఫ్రీజ్ ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు.. కరోనా కారణంగా జనగణన ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. జనాభా లెక్కలు పూర్తయిన తర్వాతే జిల్లాల విభజన సాధ్యం. లేకపోతే కేంద్రం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుంటే తప్ప.. సాధ్యం కాదు. అందుకే ముఖ్యమంత్రి యథాలాపంగా అన్నారన్న భావన ఏపీ అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది.