తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలను విభజించి కొత్తగా మరో 14 జిల్లాలు సృష్టించి మొత్తం 24 జిల్లాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాసార్లు చెప్పారు. ఇదివరకు ఒకసారి జిల్లాల పునర్విభజనకి ప్రయత్నించినప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యలు, వివిధ వర్గాల నుండి అభ్యంతరాలు రావడంతో ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టి ఆ సమస్యలన్నిటినీ ఒకటొకటిగా అధికారులు పరిష్కరిస్తున్నారు. ప్రతీ 10-15 లక్షల జనాభాకు ఒక జిల్లాను ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలన వికేంద్రీకరణ జరిగి రాష్ట్రం మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాల పునర్విభజన కోసం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొన్న తరువాత భూపరిపాలన ప్రధాన కమిషనర్ నిన్న రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకి కొత్త జిల్లాల సరిహద్దులు, జిల్లా కేంద్రాలు, స్థానిక జనాభా వంటి వివరాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. దానికి రాజీవ్ శర్మ కొన్ని సవరణలు సూచించారు. అవి సరిచేసిన తరువాత మళ్ళీ సోమవారం జిల్లాల పునర్విభజన ప్రతిపాదనను ఆయనకు సమర్పిస్తారు. దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు సలహాలు తీసుకొన్న తరువాత తుది ప్రతిపాదన ఖరారు చేస్తారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజల నుండి, వివిధ పార్టీలకు చెందిన స్థానిక రాజకీయ నేతల నుండి ఇంకా విజ్ఞప్తులు, సూచనలు, సలహాలు, అభ్యంతరాలు భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయానికి ఇంకా అందుతూనే ఉన్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకొనే ముందు ప్రభుత్వం వాటన్నిటినీ కూడా పరిశీలించి వాటిలో సహేతుకంగా ఉన్న వాటిని స్వీకరిస్తుంది. ఈ తాజా ప్రతిపాదన ప్రకారం తెలంగాణాలో కొత్తగా 11 జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఆ కొత్త జిల్లాలు ఇవే:
ప్రస్తుతం ఉన్న జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలు
ఆదిలాబాద్ మంచిర్యాల, ఆసిఫాబాద్, కొమరం భీమ్
రంగారెడ్డి వికారాబాద్
మెహబూబ్ నగర్ నాగర్ కర్నూల్
మెదక్ సిద్ధిపేట
కరీంనగర్ జగిత్యాల
వరంగల్ భూపాలపల్లి, ప్రొఫెస్సర్ జయశంకర్
ఖమ్మం కొత్తగూడెం
నల్గొండ సూర్యాపేట
నిజామాబాద్ –
హైదరాబాద్ –