ఉగాది నుంచి ఏపీలో సరికొత్త పాలన ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త జిల్లాలు, కొత్త ాజధాని, కొత్త కేబినెట్ అని వైసీపీ వర్గాలు పండుగ చేసుకోవడానికి కొత్త బట్టలు కుట్టించుకునేందుకు రెడీ అయిపోతున్నట్లుగా కనిపిస్తోంది. జిల్లాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగాది నుంచి అందుబాటులోకి రావాలని జగన్ ఆదేశించారు. ఆయన ఆషామాషీగా అనలేదని అదే రోజు నుంచి కొత్త జిల్లాలతో పాటు కొత్త రాజధానిని విశాఖగా గుర్తించి పరిపాలన చేస్తారని అంటున్నారు. అదే రోజు నుంచి సీఎం పాలన విశాఖ నుంచి ప్రారంభమవుతుందని అంటున్నారు.
ఇటీవల సినీతారలతో జరిగిన భేటీలో మనమందరం విశాఖ వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వంలో అన్నీ రహస్యంగా జరిగిపోతున్నాయి కాబట్టి సీఎం క్యాంపాఫీస్ను కూడా ఎక్కడో ఓ చోట రెడీ చేసి ఉంటారని భావిస్తున్నారు. త్వరలో ఆ విషయమూ బయటకు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో కొత్త మంత్రివర్గం కూడా ఉంటుందని చెబుతున్నారు. నిజానికి మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడానికి ఎప్పుడో కసరత్తు పూర్తి చేశారు. కానీ కాలం కలసి రావడం లేదని ఆగారు.
ఇప్పుడు ఉగాదికి ఆ పని కూడా పూర్తి చేస్తే ఓ పనైపోతుంది..ఆ తర్వాత నుంచి ఎన్నికలపై దృష్టి పెట్టవచ్చన్న ఆలోచనకు వైసీపీ అధినేత వచ్చినట్లుగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏం జరిగినా సరే.. తర్వాత నాలిక్కరుచుకున్నా సరే అనుకున్నది అనుకున్నట్లుగా చేయడం హాబీ. ఇప్పుడు ఈ విషయంలోనూ అంతే చేస్తే వచ్చే ఉగాదికి ఏపీలో వైసీపీ నేతలు పండుగ చేసుకోవడానికి రెడీ అవడం ఖాయమే.