పది జిల్లాల తెలంగాణ ఇప్పుడు 31 జిల్లాల తెలంగాణ అయింది. ఎన్నికల ప్రచారంలో.. కేసీఆర్ నారాయణపేట, ములుగులను జిల్లాలను చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు.. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని… అధికారులను ఆదేశించారు. అంతే.. ఇక.. నిద్రాణంగా మిగిలిపోయిన ఇతర జిల్లా డిమాండ్లు బయటకు వస్తున్నాయి. ఇవి అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. హుజురాబాద్ ను పీవీ నరసింహారావు జిల్లాగా మార్చాలని ఉద్యమకారులు ఆందోళనలు ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఇప్పటికి.. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌గా నాలుగు భాగాలుగా విభజించారు. హుజూరాబాద్‌ను కూడా జిల్లాను చేసి.. పీవీ పేరు పెట్టాలని అప్పట్లో ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ కొత్త జిల్లాల ప్రస్తావన తేవడంతో… మళ్లీ జేఏసీలుగా ఏర్పడి ఆందోళనలు ప్రారంభించారు.
హుజూరాబాద్ మాత్రమే కాదు.. సత్తుపల్లిలోనూ ఇలాంటి ఆందోళనలు, డిమాండ్లు ప్రారంభమయ్యాయి. జిల్లాల పునర్విభజన సమయంలో సత్తుపల్లి జిల్లా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ.. సత్తుపల్లి జిల్లా సాధనసమితి ఆధ్వర్యంలో 130రోజుల పాటు దీక్షలు నిర్వహించారు. పలు రకాలుగా ఆందోళన చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళనలు సద్దుమణిగాయి. కానీ.. తాజాగా రాష్ట్రంలో మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో.. సత్తుపల్లి జిల్లా ఏర్పాటు ఉద్యమ రూపం సంతరించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి జిల్లా అంశాన్ని అన్ని పార్టీల నాయకులు ప్రస్తావించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తుపల్లి జిల్లా ఏర్పాటు ప్రధాన అస్త్రం కానున్నదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ హామీ ఇవ్వలేదు. కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం హామీ ఇచ్చారు.
ఇక నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ, దేవరకొండలను జిల్లాగా ప్రకటించాలన్న ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన హామీల మేరకు గట్టుప్పల్‌ను మండలంగా, గుండాల మండలాన్ని జనగామ జిల్లా నుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిపేందుకు ఆదేశాలిచ్చారు. దీంతో తమ జిల్లాల సాధన ఉద్యమాలు కూడా ఫలిస్తాయన్న నమ్మకంతో మిర్యాలగూడ, దేవరకొండ జిల్లాల సాధన పేరుతో ఉద్యమ సంఘాలు ఏర్పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్, హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల నుండి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలు ఎందుకు చేయరంటూ.. ఈ ఉద్యమాలు ప్రభుత్వం ముందు కొన్ని ప్రశ్నలు ఉంచున్నాయి. 2.97లక్షల జనాభా మాత్రమే కలిగిన ములుగును జిల్లాగా ప్రకటించారు.. 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన సిరిసిల్లను జిల్లాగా ప్రకటించారు… అంత కంటే.. ఎక్కువ ఉన్న సత్తుపల్లి, హుజూరాబాద్, మిర్యాలగూడ, దేవరకొండలను ఎందుకు ప్రకటించరని అంటున్నారు.