“రాజకీయం అంటే రాక్షసంగా జనాన్ని హింసించడం” అని పరుచూరి గోపాలకృష్ణ ఓ సినిమాలో చెప్పి ఉంటారు. అలా ఆయన చెప్పి.. రెండు మూడు దశాబ్దాలు దాటిపోయింది. ఇప్పుడు అర్థం మారిపోయింది. రాజకీయం అంటే… జనాల్ని రాక్షసంగా హింసించడమే కాదు.. వారికి స్వర్గాన్ని చూపిస్తామని ఆశ పెట్టి.. చివరికి చేయకుండా.. ప్రతిపక్షాలు.. కోర్టులు అడ్డుకున్నాయని విషపు నవ్వులు నవ్వడం కూడా… రాజకీయం కిందకే వస్తోంది. మార్పులు సహజం.. రాజకీయాల్లోనూ ఆ మార్పులు వస్తున్నాయి. చేసిందంతా.. చేసి.. ఇదేం దౌర్భాగ్యపు రాజకీయం అని… అధికారంలో ఉండి.. విపక్షాల మీద నిందలేయడంతోనే… అసలు రాజకీయం.. కొత్త రంగులు పులుముకుంటోంది.
అన్నీ చట్టబద్ధంగా ఉంటే ఆటంకాలెందుకొస్తాయి..!?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టి పధ్నాలుగు నెలలు అయింది. ఈ పథ్నాలుగు నెలల కాలంలో.. నికరంగా ఆంధ్రప్రదేశ్ కోసం చేసిన ఒకే ఒక్క మంచి పని లేదు. అటు అభివృద్ధి కోసం.. రూపాయి ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. సంక్షేమం పేరుతో.. ఆయన చాలా చాలా చెబుతున్నారు. కానీ.. చేయలేకపోతున్నారు. ఆ చేయలేకపోవడం అనే చేతకాని తనాన్ని విపక్షాలు.. కోర్టుల మీద నెట్టేస్తున్నారు కానీ.. తాను నిజంగా ఎందుకు చేయలేకపోతున్నానో ఆలోచించలేకపోతున్నారు. నిజానికి ఆయన ఆలోచించే ఈ వ్యాఖ్యలు చేస్తూండవచ్చు. రాజకీయం అంటే అదే..!. వన మహోత్సవం రోజున… పేదలకు ఇంకా పంపిణీ చేయని ఇళ్ల స్థలాల వద్ద.. మొక్కలు నాటి… పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలన్నా.. సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చిందని.. ఇదేం దౌర్భాగ్య రాజకీయమని.. నిష్టూరమాడారు. రాజ్యాంగం ప్రకారం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన.. ముఖ్యమంత్రికి.., ఆ రాజ్యాంగం మీద గౌరవం లేదనే విషయం ఈ మాటలతోనే స్పష్టమవుతోంది.
ఆశ పెట్టి.. ప్రతిపక్షాల వల్ల చేయలేకపోయామని చెప్పడం మంచి రాజకీయమా..?
ఇంటి పట్టాలు ఇవ్వాలని నిజంగా ఆయనకు ఇంటే… పేదలకు నిజంగా.. ఇళ్లివ్వాలనే తపన ఆయనకు ఉంటే.. ముందుగా.. రెడీగా ఉన్న పది లక్షల ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేసేవారు. కానీ ఆయన ఆ ఇళ్లను పాడు బెట్టి అయినా సరే… పేదలకు సెంటు, సెంటున్నర స్థలాలివ్వాలని నిర్ణయించారు. పేదల దగ్గర ఉన్న అసైన్డ్ ల్యాండ్స్ లాక్కున్నారో… ఎక్కువ ధరలకు కొనుగోలు చేశారో .. ఏదైతేనే ఇవ్వడానికి సిద్ధం చేశామని చెప్పుకొచ్చారు. మరి ఎందుకు ఇవ్వలేకపోయారు..?. చట్టబద్ధంగా వారికి ఎలా అయితే.. ఇవ్వడం సాధ్యం కాదో.. అలాంటి పద్దతుల్లో ఇవ్వాలనుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను.. అమ్మేసుకోవచ్చని.. నేరుగా సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. ప్రభుత్వం సేకరించిన స్థలాలు.. జగన్మోహన్ రెడ్డి సొంత సొమ్ముతో కొనుగోలు చేసినవి కావు. పేదలంటూ పంచేసి.. వెంటనే అమ్మేసుకునే వెసులుబాటు కల్పించడానికి. ప్రభుత్వం ఎవరికీ ఆయాచితంగా లబ్ది చేకూర్చకూడదు. ఇళ్లు లేని పేదవాళ్లకి ఇళ్లు ఇస్తున్నప్పుడు.. వాటిని అమ్మేసుకుని మళ్లీ వాళ్లు ఇళ్లు లేని వారిగా మారడానికి ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది..? అసలు అలాంటి హామీ ఎలా ఇస్తుంది..? ప్రభుత్వం ఎవరికి ఎలాంటి స్థలం .. ఇచ్చినా… అది దాన్ని పొందిన వ్యక్తి అనుభవించాలి కానీ.. అమ్మడం నిషిధ్ధం. అందుకే.. ఇలాంటి స్థలాల అమ్మకాలు ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్లు జరగవు. అసైన్డ్ చట్టంకూడా అదే చెబుతోంది. ఏ చట్టం ప్రకారం చూసినా… జగన్మోహన్ రెడ్డి.. తాను పేదలకు పంపిణీ చేయాలనుకున్న స్థలాల విధానం మాత్రం.. చట్ట విరుద్ధం. అవి చెల్లవు. ఇప్పుడు.. కోర్టులు అదే చెబుతున్నాయి. ఈ విషయం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలియనిది కాదు. కానీ.. తాను ఇవ్వాలనుకున్నానని.. టీడీపీ కోర్టుకెళ్లి అడ్డుకుందని చెప్పుకోవడమే లక్ష్యంగా… ఆయన రాజకీయం చేశారు. పేదలను ఆశ పెడుతున్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు.. తాను.. డీ పట్టాలు మాత్రమే ఇవ్వగలనని.. వాటిని అమ్ముకునే హక్కును.. పేదలకు దఖలు పర్చలేనని..! అయినా సరే… ఆయన మార్క్ రాజకీయం చేసేస్తున్నారు.
రాజ్యాంగం, చట్టాలను అతిక్రమించి చేసే రాజకీయం మంచిదా..?
ఒక్క ఇళ్ల స్థలాల విషయంంలోనే కాదు.. ప్రతీ విషయంలోనూ అంతే. నిర్బంధ ఇంగ్లిష్ మీడియం దగ్గర్నుంచి మూడు రాజధానుల వరకూ…! ఎస్ఈసీని తొలగించడం దగ్గర్నుంచి కోర్టు తీర్పులను లెక్క చేయకపోవడం వరకూ.. ! ప్రతీది పరుచూరి చెప్పిన రాజకీయానికి… రెండు ఆకులు ఎక్కువే చదివి రాజకీయం ఆంధ్రలో నడిపించేస్తున్నారు. కోర్టుల్లో ఎందుకు ఎదురు దెబ్బలు తగులుతాయి..? కోర్టు ఎందుకు నిర్ణయాలని కొట్టి వేస్తాయి..?. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటుందా..? ప్రభుత్వంపై న్యాయమూర్తులకు కసి ఉంటుందా..?. న్యాయమూర్తుల విధి… రాజ్యాంగం ప్రకారం.. చట్టం ప్రకారం..న్యాయం చెప్పడం. దానికి విరుద్ధంగా ఉన్నాయంటే.. అదే చెబుతారు. అదే చెబుతున్నారు. నిర్బంధ ఇంగ్లిష్ మీడియం సాధ్యం కాదనేది.. రాజ్యాంగంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ జగన్‌కు తెలియదని ఎలా అనుకోవాలి..? ఆ తీర్పు చెప్పిన న్యాయమూర్తుల్నే.. వాళ్ల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని ప్రశ్నించే స్థాయి రాజకీయం ఆంధ్రలో నడిపించేస్తున్నారు. రాజ్యాంగ.. చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని.. తాము చెప్పిన పనులు చేయలేక.. న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగులుతూంటే… దురుద్దేశాలు ఆపాదించి.. తాము చేయాలనుకున్నాం.. చేయనివ్వడం లేదని.. ఎదురుదాడి చేయడం.. చేసే.. “జగన్ మార్క్” గొప్ప రాజకీయం ఇప్పుడు ఏపీలో నడుస్తోంది. చట్టాలకు అనుగుణంగా ప్రజలకు మంచి చేయమని చెప్పడం.. మత్రం దౌర్భాగ్య రాజకీయం.
ప్రభుత్వం శాశ్వతం కాదనే విషయం ఎవరు చెప్పినా ఎక్కదా..?
ఇప్పటికే ప్రభుత్వం.. ఏడాదిలో లక్ష కోట్లకుపైగా అప్పులు చేసింది. సరిపోవడం లేదు. మార్కెట్లు.. ఉద్యోగుల క్వార్టర్లు కూడా అమ్మాలనుకుంటున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రభుత్వాలు.., సంపదను సృష్టించే ప్రయత్నం చేశాయి. సంపదను సృష్టించి అమ్మాయేమో కానీ.. దాతలు ఇచ్చిన స్థలాలను ఎప్పుడూ అమ్మలేదు. హైదరాబాద్‌లో ప్రభుత్వాలు స్థలాలు అమ్మాయంటే.. ఎల్ బీ స్టేడియాన్ని… కోటి మార్కెట్‌ను అమ్మడం లేదు. శివారు ప్రాంతాల్లో పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించి.. అక్కడ విలువ పెరిగితే.. వాటిని అమ్మి మౌలిక సదుపాయాలు కల్పించుకున్నాయి. కానీ.. ఏపీలో ప్రభుత్వం.. మార్కెట్లు.. క్వార్టర్లు … డంపింగ్ గ్రౌండ్లను కూడా అమ్మేసి.. సొమ్ము చేసుకోవాలనుకుంటోంది. అందుకే.. హైకోర్టు… ప్రభుత్వం శాశ్వతం కాదు.. రాష్ట్రం శాశ్వతం అని గుర్తు చేయాల్సి వచ్చింది. రేపు.. ఈ భూముల్ని అమ్మలేకపోతే.. అభివృద్ధి పనులకు డబ్బుల్లేకపోతే… టీడీపీనో.. జనసేననో.. బీజేపీనో కోర్టుకెళ్లి .. డబ్బుల్లేకుండా చేసింది.. అందుకే చేయలేకపోయామనే రాజకీయం చేయడానికే.. ఈ ఫిట్టింగ్. ఎందుకంటే.. ప్రభుత్వం ఆస్తులను అమ్మడం అంత తేలిక కాదు. ఆ విషయం… గత ప్రభుత్వంలో .. ఎలాంటి డాక్యుమెంట్లు లేని.. వివాదాల్లో ఉన్న… సదావర్తి సత్రం భూములను అమ్మలేకపోవడమే… సాక్ష్యం. కానీ.. దీనిపై.. జగన్ మార్క్ రాజకీయం… విపక్షాల దౌర్భాగ్య రాజకీయం మాత్రం.. నడుస్తూనే ఉంటుంది.
ప్రజలను మోసం చేయడం మాత్రం దౌర్భాగ్య రాజకీయమే..!
రాజకీయం.. రాజకీయంగా ఎలా అయినా ఉండొచ్చు. కానీ ప్రజల్ని మోసం చేయకూడదు. వారికి చేస్తామని చెప్పిన పని నిజాయితీగా చేయాలి. చేస్తామని చెప్పి.. చెప్పి ఆశ పెట్టి.. మామూలుగా పదో పరకో చేతిలో పెట్టి.. మేము చేయాలనుకున్నాం.. వాళ్లు చేయనివ్వడం లేదని చెప్పడం… అరాచకీయమే. ప్రత్యర్థి పార్టీలతో ఎన్ని రాజకీయ వేషాలు అయినా వేయవచ్చు కానీ.. ప్రజల బతుకులతో మాత్రం ఆటలాడకూడదు. అలా ఆడితేనే.. అది దౌర్భాగ్య రాజకీయం అవుతుంది. ఇవాళ కాకపోతే.. రేపైనా ప్రజలు ఆ నిజం తెలుసుకుంటారు..!