తెలంగాణలో ముందస్తు ముచ్చట్లు పెరుగుతున్న సమయంలో కొత్తగా సీఈవోను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన 1992 బ్యాచ్‌కు చెందిన వికాస్ రాజ్‌ను కొత్త సీఈవోగా నియమించారు. ఇప్పటి వరకూ ఈ పోస్టులో శశాంక్ గోయల్ ఉన్నారు. ఆయన ఇటీవల కేంద్ర సర్వీసులకు వెళ్లారు. దీంతో కొత్త సీఈవోను నియమించాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ముగ్గురు పేర్లను ఈసీకి పంపింది. అందులో వికాస్ రాజ్‌ను ఈసీ ఎంపిక చేసుకుంది. వికాస్ రాజ్ ఆధ్వర్యంలోనే ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
వికాస్ రాజ్ ప్రస్తుతం జీఏడీ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇటీవల టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంలో బీహార్ అధికారుల రాజ్యం నడుస్తోందని వారికి తప్ప ఎవరికీ చాన్సివ్వడం లేదని ఆరోపించారు. అలా ఆరోపించిన ఐఏఎస్ ఆఫీసర్లలో వికాస్ రాజ్ కూడా ఉన్నారు. ఆయన స్వస్థలం కూడా బీహారే. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి చెప్పిన టీఆర్ఎస్ అనుకూల ఐఏఎస్ ఆఫీసరే సీఈవోగా రావడం విశేషం. గత ఎన్నికల సమయంలో బీహార్‌కు చెందిన రజత్ కుమార్ సీఈవోగా వ్యవహరించారు. ఆయన ఎన్నికల నిర్వహణా తీరు వివాదాస్పదమయింది. ఇప్పుడు ఆయన అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు వికాస్ రాజ్ కు చాన్స్ వచ్చింది.
ఎన్నికలకు సన్నద్ధం అవడానికి ఎన్నికల కమిషన్ ఏడాదిన్నర ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో సీఈవోలను మారుస్తున్నట్లుగా తెలుస్తోంది. వికాస్ రాజ్ నియామకంతో ఎన్నికలు ప్రక్రియ లో లోపాలు జరుగుతాయని కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందో.. సైలెంట్‌గా ఉంటుందో చూడాలి !