తెలంగాణ బీజేపీది విచిత్రమైన పరిస్థితి. కేంద్రంలో పరిపూర్ణమైన మెజారిటీతో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులు, కేడర్ లో ఉత్సాహం తొణికిసలాడింది. ఒకప్పటి కంటే రెట్టింపు ఉత్తేజంతో పనిచేయడానికి అంతా ముందుకొచ్చారు. ఫలితాలను నాయకత్వానికి చూపించారు. కానీ తెలంగాణలో మాత్రం అదే నిస్తేజం. మోడీ ప్రభుత్వం రాకముందు, ఆ తర్వాత పరిస్థితిలో పెద్దగా మార్పేమీలేదు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఈ పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. తెలంగాణకు వచ్చినప్పుడల్లా రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేసి వెళ్తున్నారు. కానీ అంత జోష్ మాత్రం కనిపించడం లేదు.
ప్రధాని హోదాలో తొలిసారి హైదాబాదుకు వచ్చిన నరేంద్ర మోడీ, తమ పార్టీ కేడర్ లో కొత్త ఉత్తేజం నింపడానికి ప్రయత్నించారు. తెరాసతో ఎలా వ్యవహరిచాలనే దానిపై అనుమానం అయోమయం ఉన్నా అది సమస్య కాదు. తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి వేరే పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఎవరున్నా, తెలంగాణ వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చయడానికి ఫుల్ జోష్ తో ప్రయత్నం జరిగింది. మరోవైపు, ఒకప్పుడు బీజేపీ నామమాత్రంగా ఉన్న రాష్ట్రాల్లో కేడర్ విజయ పథంలో దూసుకుపోతోంది. హర్యానాలో మిత్రపక్షం లేకుండా ఎన్నికలకు వెళ్లలేని బీజేపీ, ఏకంగా అధికారంలోకి వచ్చింది. ఈశాన్య రాష్ట్రంలోనూ సంచలన విజయం సాధించింది. తెలంగాణలో బీజేపీ ఓ బలమైన పార్టీ ఉన్న 80, 90 దశకాల్లో అసోంలో నామమాత్రపు పార్టీగా ఉండేది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జోష్ తో పనిచేసిన నాయకులు, కార్యకర్తలు తమ పార్టీని అధికారంలోకి తెచ్చారు.
తెలంగాణలో బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు. అందరూ హైదరాబాదులోనే ఉన్నారు. ఇతర జిల్లాల్లో ఒక సీటు కూడా గెలవలేదు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాదులో జరిగిన ఎన్నికల్లో కమలం వికసించలేదు. కేవలం మూడంటే మూడు డివిజన్లలో మాత్రమే బీజేపీ నెగ్గింది. కనీసం ప్రతి ఎమ్మెల్యే ఒక్కో సీటు కూడా గెలిపించ లేక పోయారు. ఇంత నిస్తేజంగా పార్టీ నేతా గణం మరే రాష్ట్రంలోనూ ఉండదేమో. హైదరాబాదులో ఓ బలమైన రాజకీయ శక్తిగా బీజేపీకి మూడు దశాబ్దాలుగా పేరుంది. అయినా 150కి 3 సీట్లకు పరిమితం కావడం ఆ పార్టీలో గూడు కట్టుకున్న నిస్తేజానికి సూచిక. మరి మోడీ పర్యటనతో అయినా కాస్త జోష్ వస్తుందో లేదో. వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేది పెద్ద మాట. కనీసం రెండంకెల్లో సీట్లయినా గెలుస్తారేమో చూడాలి.