ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు నేడు పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ముందస్తు బెయిల్ ఇస్తే 48 గంటల్లో ఆయన పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారని ఆయన తరపు లాయర్లు సుప్రీంకోర్టులో వాదించారు. ఆ ప్రకారం బెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు మరో రోజు గడువు ఇచ్చి 72 గంటల తర్వాత పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్ని ఆయన ఇంట్లో ఇచ్చారు.
శ్రవణ్ రావు విదేశాల నుంచి వచ్చారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఒక వేళ ఆయన రాలేకపోతే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తారు. అది మరిన్ని సమస్యలు తీసుకు వస్తుంది. సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చి ముందస్తు బెయిల్ తీసుకుని సహకరించకపోతే సమస్యలు వస్తాయి. ముందస్తు బెయిల్ రద్దు చేస్తారు. ఇండియాకు రావాలన్న ఉద్దేశంతోనే ఆయన ముందస్తు బెయిల్ తీసుకున్నారు. అయితే వస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ముందస్తు బెయిల్ విషయంలో లభించిన ఊరట తాత్కలికమే కావడంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ కొనసాగుతోంది.ల
శ్రవణ్ రావు ఐ న్యూస్ టీవీచానల్ యజమాని. ట్యాపింగ్ కు సంబంధించిన సర్వర్లు తన ఆఫీసులోనే పెట్టుకున్నారని పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన శ్రవణ్ రావు కేసు నమోదవగానే పరారమయ్యారు. ఇప్పటి వరకూ తిరిగి రాలేదు. ఇప్పుడు రావాల్సిన అవసరం వచ్చి పడింది. ఇక ఈ కేసులో ఏ 1గా ఉన్న ప్రభాకర్ రావు కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.