మద్యం విధానం విషయంలో అత్యధిక ఆదాయం పొందేందుకు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన విధానం.. ఆప్తమిత్రుడైన తెలంగాణ సీఎం కేసీఆర్ కు నచ్చలేదు. జగన్ ఆలోచన చేసినట్లుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే… మద్యం షాపులు పెట్టే ఆలోచన చేస్తున్నారని మీడియాలో ప్రచారం జరిగినా.. చివరికి తెలంగాణ ప్రభుత్వం మాత్రం మద్యం పాలసీని లైసెన్స్ ఫీజులు పెంచి … సరిపెట్టింది. తెలంగాణలో నవంబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలు చేయబోతున్నారు. గతంలో ఉన్న 4 శ్లాబులను 6గా మార్చారు. 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 50 లక్షలు, 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ప్రాంతాల్లో రూ.60 లక్షలు, లక్ష జనాభా నుంచి 5 లక్షల లోపు ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షలలోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లు లైసెన్స్ ఫీజు వసూలు చేయబోతున్నారు.
మద్యం దుకాణాల కోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలుగా నిర్ణయించారు. తెలంగాణలో మొత్తం 2,216 దుకాణాలకు లాటరీ పద్ధతిన దుకాణదారుల ఎంపిక జరగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉ.10 నుంచి రాత్రి 11 గంటల వరకు… ఇతర ప్రాంతాల్లో ఉ.10 నుంచి రాత్రి 10 వరకు అమ్మకాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఏపీలో… మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తూండటంతో.. అక్కడ మద్యం వ్యాపారులంతా.. తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో… పోటీ కూడా ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు.
అందుకే.. నాన్ రిఫండబుల్ దరఖాస్తుల కిందే… రూ. కోట్లు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ సర్కార్ కు … ఇప్పుడు.. ఇవన్నీ వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం సొంతంగా నిర్వహించే టెన్షన్ కన్నా.. లైసెన్స్ ఫీజులు పెంచి.. మద్యం ధరలను ఎంతో కొంత పెంచితే టెన్షన్ లేకుండా సర్కార్ కు ఆదాయం వస్తుందని.. తెలంగాణ పెద్దలు భావించినట్లుగా ఉన్నారు.