తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ఈ ఏడాది చివరికల్లా జరగవచ్చని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలతో ఉంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం తొందరపడటం లేదు. విభజన చట్టం షెడ్యూలు 9, 10 సంస్థల విభజన తర్వాతే హైకోర్టు సంగతి ఆలోచించాలని భావిస్తోంది. దీంతో సమస్య పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ ఓ ఫార్ములా ప్రతిపాదించారని సమాచారం.
ఏపీ రాజధాని అమరావతిలో ఈ ఏడాది చివరికల్లా తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేయాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ఇదీ ఫార్ములా. గవర్నర్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు పలువురు మంత్రులతో భేటీ అయినప్పుడు ఈ ఫార్ములా వివరాలను తెలిపారు. వారు కూడా సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని అంటున్నారు. ఇదే అంశంపై కేసీఆర్ తోనూ గవర్నర్ చర్చించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం షెడ్యూల్ 9, 10 లోని సంస్థల విభజనకు తెలంగాణ ఒప్పుకుంటేనే దీనిపై ముందుకు పోతామని గవర్నర్ కు తేల్చి చెప్పారని సమాచారం. తెలంగాణ సహకారం ఉంటే అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు తాము ఓకే చెప్తామనేది చంద్రబాబు జవాబు.
ఇద్దరు ముఖ్యమంత్రులను ఒప్పించగలిగితే హైకోర్టు విభజన ఈ ఏడాదిలోనే జరగవచ్చని తెలుస్తోంది. షెడ్యూలు 9, 10లోని సంస్థల విభజనకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించ వచ్చని సమాచారం. హైకోర్టు విభజన అనేది తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశంగా మారింది. కాబట్టి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఏపీ అడుగుతున్న సహకారానికి కేసీఆర్ సై అంటారని భావిస్తున్నారు.