చకచకా నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించాలని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని సవాలు ఎదురైంది. మెదక్ జిల్లాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం వివాదాస్పదంగా మారింది. జీవో 123 ప్రకారం తమ భూములను బలవంతంగా గుంజుకుంటున్నారని నిర్వాసిత రైతులు ఆక్రోశిస్తున్నారు. సరైన నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తమను నట్టేట ముంచుతోందని గగ్గోలు పెడుతున్నారు. ప్రతిపక్షాలతో పాటు జె ఎ సి కూడా వీరికి మద్దతు ఇవ్వడం విశేషం.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెదక్ జిల్లాలోని వందలాది గ్రామాల పొలాలకు సాగునీరు ఇవ్వాలనేది ఈ ప్రాజెక్టు ప్రతిపాదన ఉద్దేశం. అయితే తగినంత నష్టపరిహారం ఇవ్వడం లేదనేది రైతులు ఆరోపణ.
ఇటీవల విడుదల చేసిన జీవో 123 ప్రకారం భూసేకరణ చేస్తున్నారని, అధికారులు తమ చేత తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని రైతులు వాపోతున్నారు.
ఈ విధంగా భూసేకరణ చేయడం ఏమిటంటూ ఇటీవల హైకోర్టు మండిపడింది. తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకోవడం ఏమిటని ప్రశ్నించించింది. తగిన పరిహారం ఇచ్చిన తర్వాతే భూసేకరణ చేయాలని స్పష్టంగా సూచించింది. జేఏసీ చైర్మన్ కోదండ రాం ఇటీవల ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు నిర్వాసిత రైతులు మొరపెట్టుకున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడండి అంటూ కొందరు ఆయన కాళ్లపై పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉంటానని, అన్యాయం జరగకుండా అడ్డుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు కూడా రైతులకు మద్దతు ప్రకటించాయి.
ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాలపై మండిపడుతోంది. తాము అద్భుతంగా పరిహారం ఇస్తామని మంత్రులు చెప్తున్నారు. తాజాగా హరీష్ రావు మరోసారి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఈ ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు వ్యతిరేకం కాదన్నారు. భూసేకరణ చట్టం, జీవో 123 లలో దేని ప్రకారం భూమిని ఇవ్వాలో రైతుల ఇష్టమని చెప్పారు. ముంపు ప్రాంత ప్రజలకు బడి, గుడి, ఇళ్ల నిర్మాణంతో పాటు గ్రామాలను నిర్మించి ఇస్తామన్నారు. మల్లన్న సాగర్ లో చేపలు పట్టుకునే హక్కును కూడా ముంపు ప్రాంతాల వారికే ఇస్తామన్నారు.
ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రభుత్వం విమర్శిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల వందల గ్రామాల రైతులకు మేలు కలుగుతుందని మంత్రులు పోచారం శ్రీనివాస రెడ్డి, హరీష్ రావు చెప్తున్నారు. చివరకు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందనేది అంతుపట్టకుండా ఉంది. అసలు ప్రతిపక్షాలు చెప్పేది నిజమా లేక ప్రభుత్వం చెప్పేది వాస్తవమా అనేది కూడా చాలా మంది రైతులు అర్థం కావడం లేదు.