ఆంధ్రప్రదేశ్ లో ఒక వింత చట్టం రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దోమలపై దాడి అంటూ ఆ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ర్యాలీలు కూడా నిర్వహించారు. దోమల బ్యాటులు పట్టుకుని ప్రదర్శనలు చేశారు. కొన్ని సభలు కూడా నిర్వహించారు. అయితే, ఇన్నాళ్లూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం… ఇప్పుడు బాధ్యత పెంచాలని అనుకుంటోంది. పరిసరాల పరిశుభ్రతపై బాధ్యత పెంచేందుకు ఓ చట్టాన్ని ప్రతిపాదించబోతున్నారట. అదే.. దోమల చట్టం!
ఈ చట్టం ప్రకారం దోమల పెరుగుదలకు కారణమైన వారికి శిక్షలు వేస్తారు. అవును.. దోమల్ని పెంచడం ఇకపై నేరమే! అదేంటీ… దోమల పెంచడమేంటీ విడ్డూరంగా అనిపిస్తోంది. దోమల పెరుగుదలకు అనువైన పరిస్థితులు ఎవరైనా కల్పిస్తే.. వారికి దశలవారీగా శిక్షలు ఉంటాయట. ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత లేకపోతే.. మొదట రూ. 25 వేలు జరిమానా వేస్తారట! రెండోసారీ అదే పరిస్థితి ఉంటే రూ. 50 జరిమానా..! రోడ్డుపక్కన వ్యాపారాలు చేసుకునే తోపుడు బండ్లవారికి కూడా వాయింపు ఉంది. దోమల పెరుగుదలకు అనువైన వాతావరణం కల్పించే తోపుడు బండ్ల యజమానులకు రూ. 1000 చొప్పున జరిమానా విధిస్తారట. ఆ తరువాత, రోజుకి వంద చొప్పున జరిమానా పెరుగుతూ పోతుంది.
ఇలాంటి చట్టం తీసుకుని వస్తే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంటాయనీ, దోమలు లేకుండా పోతాయని చంద్రబాబు సర్కారు భావిస్తోందట. ఈ చట్టం ద్వారా ప్రజల్లో బాధ్యత పెంచాలనుకుంటున్నారట. ఈ ప్రతిపాదనకు సంబంధించిన కథనాలు మీడియాలో రాగానే సామాన్యులు మండిపడుతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత పంచాయతీలు, మున్సిపాలిటీలది కదా. ముందుగా వారి విధుల్ని వారు సక్రమంగా నిర్వహించే సగం సమస్యలు పోతాయి. వారిపై ఒత్తిడి పెంచకుండా, వారి విధి నిర్వహణపై నిఘా పెట్టకుండా… దోమలపై దాడి పేరుతో సామాన్యులపై ఈ జరిమానాల బాదుడు ఏంటో అంటూ మండిపడుతున్నారు.
ఇప్పటికే కొన్ని అంశాల్లో ప్రభుత్వంపై తీరుపై చాలామంది ప్రజల్లో విముఖత మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి తలతిక్క నిర్ణయాలు, చట్టాలు తీసుకుని రావాలన్న ఆలోచన ఎవరిస్తున్నారో ఏంటో..? ఇలాంటి చట్టాల్ని ఆమోదించేముందు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. సామాన్యుడు ఎలా స్పందించబోతున్నాడనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి కదా! అనుకున్నదే తడువుగా ఇలాంటి చట్టాల్ని తీసుకొస్తే.. కష్టమే..!