తెలంగాణలో నిన్నా మొన్నటివరకు మున్సిపల్ ఎన్నికల కోసం ఎదురుచూసిన ఆశావహులు.. ఇప్పుడు… లైట్ తీసుకుంటున్నారు. దీనికి కారణం .. కొత్తగా తీసుకొచ్చిన మున్సిపల్ చట్టమే. కొత్త చట్టంలో ఉన్న నియమ, నిబంధనలు చూసి… పదవి ఎప్పుడు ఊడిపోతోందనన్న భయం… నేతల్లో వెంటాడుతోంది. హరితహారం మొక్కలు బతకకున్నా కార్పోరేటర్, కౌన్సిలర్ ల పదవులు ఊడిపోతాయని చట్టంలో పొందుపరచడం.. మరీ అతిగా ఉందనే వాదన టీఆర్ఎస్ లో ప్రారంభమయింది. పైగా.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్దపడేవాళ్లు.. చట్టాన్ని పూర్తిగా చదివి.. అవగాహనతోనే పోటీకి సిద్దపడాలని కేసీఆర్ కూడా అసెంబ్లీలోనే నేరుగా చెప్పారు.
కొత్త మున్సిపల్ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందనంత వరకూ.. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో టికెట్ కోసం నలుగురైదుగురు నేతలు పోటీ పడ్డారు. తమ సీటును పక్కా చేసుకునేందుకు ఎమ్మెల్యేలు, మంత్రుల వెంట పడ్డారు. అయితే గెలిచినా పదవి మున్నాళ్ళ ముచ్చటగా మారటంతో ఆశావహులు… ఇప్పుడు వెనకాముందు ఆలోచిస్తున్నారట. ఎన్నికలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం కావటంతో.. పోటీ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని తమ అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో ఇదే గోడు వెళ్ళబోసుకుంటున్నారు.
కింది స్థాయి నేతల ఆవేదనపై ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఖర్చు పెట్టుకుని.. కష్టపడి గెలిచిన తర్వాత తమను పదవినుంచి తప్పించడానికి.. చిన్న కారణం చాలని.. నమ్ముతున్నారు. ఎమ్మెల్యేలు కూడా టికెట్లు ఇప్పించటం మినహా గెలిచిన తర్వాత వారి పదవులు ఉంటాయా ఊడతాయా అనేది తమ చేతుల్లో ఉండదని ముందుగానే చెప్పేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుని ప్రజాప్రతినిధులైపోదామనుకున్న టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు.. కొత్త మున్సిపల్ చట్టం.. మింగుడుపడటం లేదు.