ఏపీలో అత్యంత వివాదాస్పదమైన వాటిలో మద్యం బ్రాండ్లు ఒకటి. గతంలో ఎన్నడూ వినని, చూడని పేర్లతో కొత్త కొత్త మద్యం బ్రాండ్స్ కనిపించాయి. వీటిపై వచ్చిన వార్తలు, మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. ఏపీ రాజకీయాల్లో ఈ బ్రాండ్ల లొల్లి కూడా చాలా పెద్దదే.
ఇప్పుడు ఇవే సీన్స్ తెలంగాణలోనూ రిపీట్ అయ్యేలా కనపడుతున్నాయి. మొన్ననే స్వయంగా అబ్కారీ మంత్రి వచ్చి కొత్త మద్యం బ్రాండ్లు తెలంగాణలో రావు, పర్మిషన్ ఇవ్వలేదు అని వివరణ ఇచ్చారు. వారం కూడా గడవ లేదు మాకు తెలంగాణలో మద్యం అమ్ముకునేందుకు అనుమతి వచ్చిందని ఓ కంపెనీ అధికారికంగా ప్రకటన కూడా చేసుకుంది.
హంటర్, పవర్, బ్లాక్ ఫోర్ట్, వుడ్ పికర్ పేర్లతో కొత్త బ్రాండ్ బీర్లు తెలంగాణలోనూ అమ్మబోతున్నట్లు సోమ్ డిస్టిలరీస్ ప్రకటించింది. కానీ ఇదంతా మంత్రికి తెలియకుండానే జరిగిందా అన్న అనుమానాలు వస్తున్న దశలో బీఆర్ఎస్ మరింత దూకుడు పెంచి ఆరోపణలు చేసింది.
కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల విరాళాలు ఇచ్చిన ఈ కంపెనీని క్విడ్ ప్రోకో లో భాగంగానే తెలంగాణలో అనుమతించారని, గతంలో ఈ కంపెనీ కల్తీ మద్యం చేస్తుందని మధ్యప్రదేశ్ బ్యాన్ చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు ఈ కంపెనీతో సంబంధాలున్నాయని విమర్శలు గుప్పించింది. రానున్న రోజుల్లో గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్స్ కూడా అనుమతిస్తారేమో అంటూ కామెంట్ చేసింది.
దీనికి అబ్కారీ మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.