తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరింత విస్తృతమైన మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకుంది. ఇటీవల టీజీబీసీఎల్ ధరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు రాష్ట్రంలో 604 కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల అనుమతి కోసం 92 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. 45 మద్యం సరఫరా చేసే పాత కంపెనీలు 218 కొత్త రకాల మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తులు చేసుకోగా, 47 కొత్త కంపెనీలు 386 రకాల కొత్త మద్యం బ్రాండ్ల కోసం టిజిబిసిఎల్కు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
92 మద్యం సరఫరా చేసే కంపెనీలు 604 కొత్త మద్యం బ్రాండ్ల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 331 రకాల కొత్త మద్యం ఇండియన్ మెడ్ లిక్కర్స్ బ్రాండ్స్ కాగా, 273 రకాల ఫారిన్ లిక్కర్ బ్రాండ్ల కోసం వచ్చిన దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో తొలిసారిగా కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సూచించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులు చేసుకోవాలని టిజిబిసిఎల్ ఫిబ్రవరి 23వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ దరఖాస్తులకు ఏప్రిల్ 2వ తేదీ వరకు గడువు ఇచ్చింది.
కొత్త బ్రాండ్ల దరఖాస్తులను స్క్రూటినీ చేసి ప్రభుత్వం వద్దకు టీజీబీసీఎల్ పంపనుంది. ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతుల మేరకు.. నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వం ఈ ఏడాది మద్యం ఆదాయాన్ని గణనీయంగా అంచనా వేస్తోంది. అందుకే లిక్కర్ బ్రాండ్లకు ఎక్కువగా అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు విమర్శలూ రావడం సహజమే. అయినా ఆర్థిక కారణాల రీత్యా ప్రభుత్వానికి తప్పదు.