అక్టోబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తోంది. ఇదే అంశాన్ని ఎక్సైజ్ శాఖమంత్రి నారాయణ స్వామి మీడియాకి చెప్పారు. 4,380 బెల్టు షాపులను 3,500కి ప్రభుత్వం కుదించిందని చెప్పారు. సంపూర్ణ మద్య నియంత్రణలో భాగంగా బెల్టు షాపుల నియంత్రణ, ఇప్పుడు ప్రభుత్వమే దుకాణ నిర్వహణకి తీసుకోవడం అనేది మరో దశగా ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు, ప్రభుత్వం నిర్వహించబోయే దుకాణాల పక్కనే పర్మిట్ రూమ్ లు ఉండవు. అంటే, గతంలో మాదిరిగా దుకాణం దగ్గరే కొనుక్కుని తాగే వెసులుబాటు ఉండదు. గతంలో ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో దుకాణాలు ఉండేవి కాబట్టి, మద్యం అమ్మకాలపై కొంత పర్సంటేజీ వారికి వెళ్లేంది. ఇప్పుడు ప్రభుత్వమే దుకాణాలు నిర్వహిస్తుంది కాబట్టి, ఆమేరకు ప్రభుత్వానికే ఆదాయం వస్తుందని చెప్పొచ్చు. దుకాణాల్లో పనిచేసేందుకు బడుగు బలహీన వర్గాలకు చెందినవారికే ఎక్కువగా అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది.
దశలవారీగా మద్యాన్ని నిషేధించే క్రమంలోనే ఈ విధానాలను చేపడుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇలా ఎప్పటికప్పుడు విధానాలు అమలు చేసుకుంటూ పోతే… రాష్ట్రంలో మద్యం లేకుండా చెయ్యొచ్చు అనే ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, మద్యం విషయంలో నిషేధం దిశగా ప్రభుత్వం వెళ్తున్నప్పుడు… విధానాలతోపాటు ఇతర సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ హయాంలో అప్పటి ప్రభుత్వం కూడా ఇలానే ముందుకెళ్లింది. కానీ, కల్తీ మద్యాన్ని అరికట్టడం సవాలుగా మారింది. ఆ తరువాత, ప్రభుత్వమే సారాయి దుకాణాలు తెరవాల్సి వచ్చింది. దాంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తరువాతి పరిస్థితులు ఏంటో అందరికీ తెలిసిందే. అంటే, పాలసీలు తయారీ ఒక ఎత్తు అయితే, వాటిని కచ్చితంగా అమలు చేయడం పెద్ద సవాల్.
ఇంకో సవాలు సరిహద్దు రాష్ట్రాల నుంచి ఉంటుంది! ఆంధ్రా సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశాలలో మద్య నిషేధం లేదు. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకునేవాళ్లు చాలామంది ఉంటారు. గతంలో, మద్య నిషేధ సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మద్యం అక్రమ వ్యాపారాలు చేసి, అకస్మాత్తుగా ధనవంతులైపోయి, ఆ తరువాత రాజకీయ నాయకులు అయిపోయినవారు కొందరు ఉన్నారు!! కాబట్టి, సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా రానీయకుండా కఠిన చర్యలను ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. సంపూర్ణ మద్య నిషేధం దిశగా ఏపీ సర్కారు చేస్తున్న ప్రయత్నం హర్షించదగిందే. దాంతోపాటు ఎదురు కాబోయే సవాళ్లపై కూడా కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది.