ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులేయాలని వైసీపీ సర్కార్ నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఉన్న బార్ ల లైసెన్స్ లను రద్దు చేయాలని ఎక్సైజ్ శాఖ చట్టంలోని సెక్షన్ 32 ప్రకారం నిర్ణయించింది. ఈ మేరకు జీవో ను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం స్టార్ హోటల్స్ మినహా 797 బార్ లు ఉన్నాయి. వీటి లైసెన్స్ లను వెంటనే రద్దు చేసింది. వచ్చే ఏడాది జూన్ 30వ తేదీ వరకు ప్రభుత్వానికి బార్ల యజమానులు లైసెన్స్ ఫీజులను చెల్లించారు. లైసెన్స్ రద్దు చేసిన దగ్గర్నుంచి జూన్ 30వ తేదీవరకు ఉన్న లైసెన్స్ ఫీజును యజమానులకు తిరిగిచ్చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బార్ ల లైసెన్స్ ఫీజులను కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.
50 వేలలోపు జనాభా ఉన్న పట్టణంలో బార్ లైసెన్స్ ఫీజు ఏడాదికి 20 లక్షల రూపాయలు, లక్ష నుంచి 5 లక్షలలోపు జనాభా ఉన్న పట్టణంలో 45 లక్షల రూపాయలు, 5 లక్షలపైబడి జనాభా ఉన్న నగరాల్లో బార్ లైసెన్స్ ఫీజు 70 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఇక స్టార్ హోటల్స్ ను, మైక్రో బ్రూవరీస్ కి లైసెన్స్ ఫీజును ఏడాదికి కోటిన్నర రూపాయలుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను 40 శాతం తగ్గిస్తారు. ఇక ముందు 477 బార్లకు మాత్రమే లైసెన్స్ ఇస్తారు. వీటికోసం దరఖాస్తుదారులు ఆన్ లైన్ లో 10 లక్షల రూపాయలు దరఖాస్తుతో చెల్లించాల్సి ఉంటుంది. ఈ 10 లక్షల రూపాయలను తిరిగి ఇవ్వరు. ఒక్కో బార్ కు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు లొస్తే లాటరీ విధానం ద్వారా ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాల కలెక్టర్లు ఈ లాటరీ కార్యక్రమాన్ని చేపడతారు. ఈ లైసెన్స్ లను రెండేళ్లకు ఇవ్వాలని నిర్ణయించారు.
ఏడాది పూర్తయిన తర్వాత లైసెన్స్ ఫీజును 10 శాతం పెంచుతారు. బార్లు తెరిచే వేళలను కూడా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉంటుంది. బార్లకు సరఫరా చేసే మద్యం ధర క్వార్టర్ కు 60 రూపాయలు పెంచారు. ప్రభుత్వం మద్యం రిటైల్ దుకాణాల్లో క్వార్టర్ కు 100 రూపాయలకు దొరుకుతుంటే అదే మద్యం బార్లలో 160 రూపాయలకు ధర ఉంటుంది. ఇవన్నీ మద్యం తాగేవారిని.. వ్యసనానికి దూరం చేస్తాయని భావిస్తున్నారు.