ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్కార్కు మద్యం కిక్ ఇవ్వబోతోంది. వివిధ రంగాల్లో తగ్గిపోయిన ఆదాయం మొత్తం.. ఒక్క మద్యం విభాగంలోనే ఈ ఏడాది పొందబోతోంది. లైసెన్స్ దారులను తీసేసి… ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహించడం ప్రారంభించింది. సెప్టెంబర్ 30వ తేదీ అర్థరాత్రి ప్రభుత్వం మద్యం ధరలను 20 శాతం పెంచుతూ జీవో జారీ చేసింది. క్వార్టర్ బాటిల్ పై రూ. 20 , హాఫ్ బాటిల్ పై రూ. 40 , ఫుల్ బాటిల్ పై రూ. 80 ధరలు పెంచింది. ఆంధ్రప్రదేశ్ లో చీప్ లిక్కర్ తోపాటు మీడియం బ్రాండ్స్ ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంపై 20 వేల కోట్ల రూపాయల పైబడి జమకాగా, ఇందులో 17 వేల 500 కోట్ల రూపాయలు ఎక్సైజ్ పన్ను రూపంలోనే వచ్చింది. మద్యం అమ్మకాలు ఏటా పదిశాతం పెరుగుతున్నాయి.
బడ్జెట్ లో మద్యం ద్వారా ఈ ఏడాది రూ. 2, 297 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెప్పింది. కానీ పెరిగిన ధరలు లెక్క వేస్తే.. ఈ మొత్తం రూ. ఆరు వేల కోట్లకుపైగానే ఉంటుంది. మద్యం ధరలు పెంచటం వల్ల మద్యం తాగేవారిపై అదనపు భారం మోపటానికి ప్రధాన కారణం.. వారిని తాగుడుపట్ల విముఖత వ్యక్తం చేసే విధంగా చేయటమేనని కొత్త సిద్ధాంతాన్ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న తరుణంలో నికరంగా ఆదాయం వస్తుందని భావిస్తున్న ఎక్సైజ్ శాఖలో ఆదాయం తగ్గిపోతే ఎలా అని తొలుత అధికారులు ఆందోళన చెందారు. కానీ మద్యం ధరలు పెంచటం వల్ల గతేడాదికంటే అదనపు ఆదాయం వస్తుందని ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు.
రాష్ట్రంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి సర్కారే మద్యం షాపులను స్వయంగా నిర్వహిస్తుండటంతో అందులో పనిచేసే సిబ్బందికి ప్రస్తుతం కొత్త తంటా వచ్చిపడింది. ప్రభుత్వం సెప్టెంబర్ 30వ తేదీ అర్థరాత్రి మద్యం ధరలను పెంచుతూ తక్షణమే ఈ ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే ప్రభుత్వం నిర్వహించే మద్యం షాపులకు అప్పటికే నిల్వలు వచ్చాయి. ఆ బాటిళ్లపై పాత ధరలే ఉన్నాయి. ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ధేశించిన తరుణంలో మద్యం రేట్లు ఎక్కువగా వసూలు చేయడంపై మందుబాబులు సిబ్బందితో వివాదానికి దిగుతున్నారు.