తెలుగు మీడియా రంగంలో మరో చానల్ చేతులు మారింది. మహా టీవీని బీజేపీకి చెందిన ఎంపీ ఒకరు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన పూర్తిగా చానల్ స్వరూపాన్ని మార్చేస్తున్నారు. టీవీ9తో కెరీర్ ప్రారంభించి… అనేకానేక చానళ్లు తిరిగి… చివరికి జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షితో ఎక్కువ అనుబంధం కొనసాగించిన స్వప్నకు.. ఆ చానల్ బాధ్యతలు అప్పగించారు. ఆమె ఇప్పటికే సోషల్ మీడియాలో… ఈ విషయాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. తాను చేపట్టబోయే చర్చా కార్యక్రమాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు.
మహాటీవీ ఇప్పటికి ఎన్ని చేతులు మారిందో లెక్కే లేదు. మొదటగా.. ఈ చానల్‌ను.. ప్రముఖ జర్నలిస్ట్ ఇనగంటి వెంకట్రావు ప్రారంభించారు. మొదట్లో.. ఇప్పుడు టీవీ9ని ఒంటి చేత్తో తిప్పేస్తున్న రజనీకాంత్ ఆ చానల్లో చేరారు. కానీ.. పునాదుల్ని లేపడం ఆయన వల్ల కాక.. మధ్యలోనే చేతులెత్తేసి..మళ్లీ రవిప్రకాష్ దగ్గరకు చేరిపోయారు. ఆయనను నమ్ముకుని వెంకట్రావు కూడా మునిగిపోయారు. పునాదులే బలహీనంగా పడటంతో ఆ చానల్ నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత వరుసగా యాజమాన్యాలు మారుతూ వస్తోంది. టీడీపీ హయాంలో జర్నలిస్టుగా పని చేసిన వంశీ అనే వ్యక్తి ఆ చానల్ నిర్వహణ బాధ్యతను తీసుకున్నారు. కొంత మంది టీడీపీ నేతలు సహకరించారని చెప్పుకున్నారు కానీ తెరమీదకు ఎవరూ రాలేదు.
కొన్నాళ్లు సుజనా చౌదరి నడిపారని..మరికొన్నాళ్లు పరకాల ప్రభాకర్ బాధ్యత తీసుకున్నారనిచెప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం యాజమాన్యం మారింది. దీంతో మార్పు కనిపిస్తోంది. ఆ యాజమాన్యం… ముందు ఎవరు ఉన్నా.. తెర వెనుక మాత్రం బీజేపీ సపోర్టరనన్న చర్చ మాత్రం నడుస్తోంది. పుట్టినప్పటి నుండి దినదిన గండం అన్నట్లుగా ఉన్న.. మహాటీవీకి ఎప్పుడూ… ఆర్థిక పరంగా ఇబ్బందికర పరిస్థితులు రాలే్దు. ఎవరో ఒకరు వచ్చి చానల్‌ను నడిపిస్తూనే ఉన్నారు. ఒకరి ఓపిక అయిపోయాక..మరొకరు వచ్చి.. చానల్‌ను నడిపిస్తున్నారు. ఇప్పుడు… ఆ చానల్ స్వప్న చేతుల్లోకి వెళ్తోంది.