తెలంగాణలో కొత్తగా పది మందికి మంత్రి పదవులు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. రెండు నెలల తర్వాత పూర్తి స్థాయి మంత్రి వర్గం మంగళవారం కొలువు దీర నుంది. సామాజిక సమీకరణాలు విధేయతకు పెద్ద పీట వేసి.. పదవు పంపకం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్క ఖమ్మం మినహా అన్ని జిల్లాలకు చోటు కల్పించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుండి వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కు పదవులు ఖరారు చేశారు. నల్గొండ జిల్లా నుంచి జగదీష్ రెడ్డి కి మళ్లీ అవకాశం దక్కింది. నల్లగొండ కోటాలో ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిలకు కూడా అవకాశం లభిస్తుందని ప్రచారం జరిగినా కేసిఆర్ జగదీశ్వర్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కు క్యాబినెట్ బెర్త్ ఖరారైంది.
కరీంనగర్ నుంచి ఈసారి కొప్పుల ఈశ్వర్ కు మంత్రివర్గంలో చోటు దక్కింది. మొదటి నుంచి పార్టీలో కీలక నేతగా ఈశ్వర్ ఉన్నారు. అదే జిల్లానుంచి బిసి నేత, పార్టీ ఆవిర్భావం నుంచి కెసీఆర్ కు వెన్నంటి ఉన్న ఈటెల రాజేందర్ మంత్రి పదవి అవకాశాలపై అనేక అనుమానాలు వెలువడినా .. చివరకి ఆయన్ను మళ్లీ కేబినెట్ లోకి తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి పదవి ఖరారయింది. నిజామాబాద్ జిల్లా నుంచిఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రాజెక్టుల సందర్శనకు ప్రశాంత్ రెడ్డిని కేసీఆర్ తీసుకెళ్లారు. హైదరాబాద్ నుంచి బిసి కోటానుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు చోటుకల్పించారు. రంగారెడ్డి జిల్లా నుంచి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి కూడా మంత్రివర్గంలో చోటు దాదాపుగా ఖరారైంది. సామాజిక సమీకరణతో పాటు జిల్లాలో ఆర్థికంగా బలమైన నేత కావడంతో ఆయనకు కలిసి వచ్చింది.
10 మందితో జరుపనున్న విస్తరణలో 6 గురికి కొత్తగా అవకాశం కల్పిస్తున్నారు.. మరో 4గురు గత కేబినెట్లో పనిచేసిన అనుభవం ఉన్నవారు. పది మంది మంత్రుల్లో రెడ్డి సామాజికవర్గం నుండి నలుగురు, వెలమ సామాజికవర్గం నుండి ఒక్కరు, బిసి సామాజికవర్గం నుండి ఇద్దరు, ఎస్సీ మాల సమాజికవర్గం నుండి ఒక్కరికి మంత్రిపదవులు కట్టబెట్టబోతున్నారు కేసిఆర్. ఈ విస్తరణలో ఒక్క ఖమ్మం జిల్లా మినహా అన్ని ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లభిస్తున్నట్లైంది. లోక్ సభ ఎన్నికల తర్వాత.. ఎస్సీ, బిసి, ఎస్టీ సామాజికవర్గాలనుండి ఒక్కొక్కరిని, వెలమ సమాజికవర్గం నుండి హరీశ్, కేటిఆర్, మహిళా కోటా నుండి మరో రెడ్డి సామాజికవర్గానికి చెందిన మహిళా నేతను కేబినెట్ లోకి తీసుకోవాలని కేసిఆర్ భావిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.