వైసీపీ అంటే దూకుడు. ఈ దూకుడుకు రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు. అందులో మొదటిది బూతులు. మంత్రులుగా తెర ముందుకు వచ్చే వారు తమ భాషా సామర్థ్యాన్ని విపరీతంగా ప్రదర్శించేవారు. కొడాలి నాని, పేర్ని నాని , వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, ఇలా చెప్పుకుంటూ పోతే.. అందరూ నోరున్న వారే. ఇప్పుడు వారి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రెస్ మీట్ పెట్టిన మంత్రులు తేలిపోతున్నారు. తమ మార్క్ చూపించడం కాదు కదా.. పూర్తిగా తడబడిపోతున్నారు. పదవుల్లేనప్పుడు స్టార్ ప్లేయర్లుగా ఉన్నవారు ఇప్పుడు డక్కట్లవుతున్నారు.
అంబటి రాంబాబు మంచి వాచకం ఉన్న వ్యక్తి. ఆయన సినిమాల్లో డైలాగులు చెప్పినట్లుగా ప్రెస్ మీట్లలో మాట్లాడతారు. మంత్రి అయిన తర్వాత ఆయన ఇంకా ఎక్కువ ఆశిస్తారు. కానీ రివర్స్‌లో జరుగుతోంది. చెప్పింది రాసుకోండి అంటున్నారు. మీడియా ప్రతినిధులు మాత్రం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. డయాఫ్రంవాల్ ఏంటో కూడా తెలియకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఆయన పెట్టిన రెండు ప్రెస్ మీట్లు వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి. ఇక విజయవాడ అత్యాచారం ఘటనలో హోంమంత్రి స్పందించిన తీరు కూడా అంతే వైరల్ అయింది. మీడియా మైకుల ముందు నిలబడి…తనకు ఏమీ తెలియదని ఆమె నిరూపించేసుకున్నారు.
ఇక మంత్రి ఉషాశ్రీచరణ్ అయితే స్కూల్ పిల్లలో కలిసి భోజనం చేస్తూ ఇది సాంబార్ అన్నమా.. కిచిడినా అని అడుగుతున్న వీడియో వైరల్ అయిపోయింది. ఇక మంత్రి రోజా అయినా తన మార్క్ ను మంత్రి లెవల్ కు తీసుకెళ్లి చూపిస్తారనుకుంటే.. మంత్రయ్యాను కాబట్టి కాస్త పద్దతిగా ఉండాలని అనుకుంటున్నారేమో కానీ.. చంద్రబాబే ఉన్మాది వంటి రొటీన్ మాటలకు పరిమితమవుతున్నారు. దీంతో వైసీపీ మంత్రుల్లో గతంలో లాంటి ఆణిముత్యాలు లేరన్న అభిప్రాయం ఆ పార్టీలోనే ప్రారభమయింది. ఈ లోటును సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా తీరుస్తారో చూడాలి మరి. !