భారతీయ జనతా పార్టీ టెన్షన్లో ఉంది. మిత్రపక్ష పార్టీలన్నీ గుడ్‌బై చెబుతున్నాయి. ఉన్న పార్టీలు చొక్కా పట్టుకుని మరీ సీట్ల గురించి బేరాలాడుతున్నాయి. వారిని బుజ్జగించలేక… సిట్టింగ్ సీట్లు సైతం ధారాదత్తం చేయాల్సి వస్తోంది. ఇంత చేసినా.. బీజేపీకి బలమైన మిత్రపక్ష పార్టీలు ఏవీ లేవు. మహారాష్ట్రలో శివసేనతో కలిసి పోటీ చేయకపోతే…గెలిచే సీట్ల సంఖ్య సున్నా దగ్గర తేలినా ఆశ్చర్యం లేదు. కానీ శివసేన మాత్రం… కాంగ్రెస్ పార్టీ కన్నా దారుణంగా బీజేపీపై, మోడీపై విమర్శలు చేస్తున్నారు. హిందీ రాష్ట్రాల్లో వంద సీట్లుపైనే తగ్గిపోతాయి. అందుకే తాము ప్లాన్ బీ అమలు చేస్తామని రామ్‌మాధవ్ చెబుతున్నారు. ఈ ప్లాన్ బీలో భాగంగా దక్షిణాది నుంచి కొత్త పార్టీలను ఎన్డీఏలో చేర్చుకుంటారట..!
దక్షిణాదిలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. కర్ణాటక మినహా ఏ రాష్ట్రంలోనూ… ఆ పార్టీకి ఉనికి లేదు. పైగా తీవ్ర వ్యతిరేకత ఉంది. పొత్తులకు కూడా.. ఇతర ప్రాంతీయ పార్టీలు ముందుకు వస్తాయన్న నమ్మకం లేదు. కానీ రామ్‌మాధవ్ మాత్రం.. ఎన్నికలకు ముందే ఎన్డీఏలోకి కొత్త పార్టీలు వస్తాయని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. బీజేపీతో లోపాయికారీ సంబంధాలను.. కొనసాగిస్తున్న పార్టీలు దక్షిణాదిలో ఉన్నాయి. వాటిలో మొదటిది.. తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే. అధికారం అండతో .. అన్నాడీఎంకే నేతల్ని చెప్పుచేతల్లో ఉంచుకున్న బీజేపీ నేతలు.. వచ్చే ఎన్నికల్లోపు.. ఆ పార్టీని ఎన్డీఏలో చేర్చుకోనున్నారు. అంతే కాదు.. డిమాండ్ చేసి మరీ భారీగా పార్లమెంట్ సీట్లలో పోటీ చేయబోతున్నారన్న ప్రచారం తమిళనాడులో ఊపందుకుంది. బీజేపీని ఎదిరించే శక్తి పళనిస్వామి, పన్నీర్ సెల్వంకు లేదు. అందుకే ఎన్డీఏలోకి అన్నాడీఎంకే ఖాయమనుకోవచ్చు.
మరి బీజేపీతో సన్నిహితంగా ఉంటుందని పేరు పడిన మరో పార్టీ వైసీపీ. ఏపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ.. చాలా రోజులుగా బీజేపీకి సపోర్టర్‌గా వ్యవహరిస్తోంది. సొంత రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీజేపీ పట్టీపట్టనట్లు ఉన్నా..”.మా మంచి బీజేపీ ” అని వెనకేసుకొస్తోంది. ఇటీవలి కాలంలో ఈ సమర్థింపులు ఎక్కవ అయ్యాయి. పత్రికలో… ఢిల్లీలో కూడా గర్జనలు చేసి.. బీజేపీ తప్పేమీ లేదని.. అంతా చంద్రబాబు తప్పేనని చెబుతున్నారు. ఓ రకంగా.. ఇదంతా.. బీజేపీతో పొత్తు కోసం… వైసీపీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోందనే అనుమానాలున్నాయి. ఇక బీజేపీతో సన్నిహితంగా ఉంటుందని భావిస్తున్న మరో దక్షిణాది పార్టీ టీఆర్ఎస్. ముందస్తు ఎన్నికలకు సహకరిచినందుకు గాను.. పార్లమెంట్ ఎన్నికల్లో… పొత్తు పెట్టుంటామని.. కేసీఆర్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అదే నిజం అయితే.. టీఆర్ఎస్ ఎన్డీఏలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఫెడరల్ ఫ్రంట్ పై ఎవరూ స్పందించకపోవడాన్ని కారణంగా చెప్పి.. ఆయన బీజేపీ కూటమిలో చేరవచ్చు. ఇక కర్ణాటక, కేరళల్లో ఆ పార్టీతో పొత్తులు పెట్టుకునే పార్టీలేవీ లేవు. అంటే.. దక్షిణాది నుంచి ఎన్డీఏలోకి కొత్తగా ఎవరైనా వెళ్తారంటే.. అవి అన్నాడీఎంకే, వైసీపీ, టీఆర్ఎస్ మాత్రమే. మరి రామ్ మాధవ్.. ప్లాన్ బీలో.. ఏ పార్టీలు ఉన్నాయో..?