ఈ దసరా ప్రత్యేకం. రెండు తెలుగు రాష్ట్రాలు దశ, దిశ మార్చుకుని పాలనలో కొత్త పుంతలు తొక్కుతూ నవ శకానికి నాంది పలకనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో పాలన మొత్తం అమరావతి నుంచే మొదలు కానుంది. వెలగపూడి నుంచి వెలుగు బాటలో పయనించనుంది.
21 కొత్త జిల్లాలతో తెలంగాణ భౌగోళిక, పరిపాలన స్వరూపం సమూలంగా మారనుంది. మొత్తం 31 జిల్లాలతో నవ తెలంగాణ ఆవిష్కృతం కాబోతుంది.
2014 జూన్ 2. రెండు తెలుగు రాష్ట్రాలు ఆవివర్భవించిన రోజు. 2016 అక్టోబర్ 11. రెండు రాష్ట్రాలూ నవశకానికి నాంది పలికే రోజు. అమరావతి నుంచి పాలన సాగించాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరడానికి ఇక ఏ అడ్డంకీ లేదు. విజయదశమి పర్వదినాన సొంత రాష్ట్రంలోనే పరిపాలన మొదలవుతుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకున్న విధంగానే అంతా సాఫీగా జరగనుంది. ఇప్పటికే ఉద్యోగులు అమరావతికి తరలివచ్చారు. ఇకమీదట పరిపాలన విషయంలో హైదరాబాద్ పై ఆధారపడాల్సిన అవసరం లేదు.
నవతెలంగాణ కొంగొత్త రూపును సంతరించుకోనుంది. 31 జిల్లాలతో అధికార వికేంద్రీకరణకు కొత్త అర్థం చెప్పనుంది. చిన్న రాష్ట్రం, చిన్న జిల్లాలు. ఇక వేగంగా అభివృద్ధి సాధించడం లక్ష్యమని కేసీఆర్ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. కొత్త జిల్లాల పాలకుల నియామకం కూడా జరిగింది. కలెక్టర్లు, ఎస్పీల నియామకం అనే లాంఛనం పూర్తయింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాను ప్రారంభిస్తారు. ఏ జిల్లాను ఎవరు ప్రారంభించాలనేది కూడా నిర్ణయమైపోయింది. అట్టహాసంగా కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ప్రారంభోత్సవం జరుగుతుంది. మిఠాయిల పంపకాలు, విద్యుత్తు వెలుగు జిలుగులతో సంబరాలు అంబరాన్నంటేలా సాగనున్నాయి. విజయ దశమి అంటే విజయానికి సూచిక. రెండు తెలుగు రాష్ట్రాల కొత్త దశ సరికొత్త దిశలో దిగ్విజయంగా సాగిపోవాలని ఆశిద్దాం.