భారతీయ జనతా పార్టీతో పొత్తును కొనసాగించాల్సిన చారిత్రక అవసరం చంద్రబాబుది! అంతేకాదు, దాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ కాపాడుకోవాల్సిన అవసరం కూడా తెలుగుదేశం పార్టీకే ఉంది. ఎందుకంటే, రానురానూ భాజపా బలపడుతోంది. ప్రాంతీయ పార్టీల బలహీనతను కూడా కోరుకుంటోంది. రాష్ట్రాల వారీగా లక్ష్యాలు పెట్టుకుని మరీ అధికారం కైవసం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏపీలో తెలుగుదేశాన్ని కాపాడుకోవాలంటే… కేంద్రంతో భాజపాతో పొత్తును మరింత కట్టుదిట్టం చేసుకోవాలి! అందుకే, ఈ మధ్య ఛాన్స్ దొరికితే చాలు.. భాజపాతో పొత్తు రెండు పార్టీలకూ అత్యావశ్యకం అనేట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే… ఏపీలో టీడీపీతో కొనసాగాల్సిన అవసరం భాజపాకే ఎక్కువగా ఉన్నట్టు చిత్రించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పక తప్పదు!
తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలో కూడా చంద్రబాబు దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేయడం గమనార్హం! ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజక వర్గాల్లో ఐదింట పోటీ చేస్తే… ఒక చోట మాత్రమే భాజపా అభ్యర్థి గెలిచారు. గ్రాడ్యుయేట్ల నియోజక వర్గం నుంచి విశాఖ బీజేపీ అభ్యర్థి మాధవ్ గెలుపొందారు. ఇతర స్థానాల్లో తెలుగుదేశం బలపరచినవారు ఓడిపోయారు. అయితే, ఈ సందర్భంగా చంద్రబాబు కొంతమంది భాజపా నాయకులతో మాట్లాడుతూ… తెలుగుదేశం, భాజపా కలిసి పనిచేస్తే అన్ని ఎన్నికల్లోనూ తమ కూటమికే విజయం దక్కుతుందని అన్నారట. భవిష్యత్తులో కూడా ఇదే తరహా ఐకమత్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారట! అంతేకాదు, రాబోయే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇలానే కలిసి గెలుద్దామని కూడా చెప్పారట!
మొత్తానికి, తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాల్సిన అవసరం భాజపాకి ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పాము చావకూడదు, కర్ర విరగ కూడదు అన్నట్టుగా ఉంది! ఓ పక్క భాజపాతో పొత్తు కావాలి. అదే సమయంలో ఆ పార్టీపై ఏపీలో ఆధిపత్యమూ కావాలి. రాష్ట్రంలో భాజపా తమ చెప్పు చేతల్లో ఉండాలి. కేంద్రంలో భాజపా తమకు చేదోడు వాదోడుగా ఉండాలి! ఆ మాటకి వస్తే.. ఎవరి అవసరం ఎవరికి ఉందో, ఎందుకు ఉందో, ఏ ప్రయోజనాల కోసం ఉందో అనేది మోడీకి తెలియని విషయం కాదు కదా!
చంద్రబాబు చాచుతున్న ఈ మైత్రీ హస్తం వెనక మరో కోణం కూడా చూడాలండోయ్..! ఏపీలో భాజపా స్వతంత్రంగా ఎదిగేందుకు కావాల్సిన ఏ చిన్ని అవకాశాన్ని ఇవ్వకుండా కట్టడి చేయడం కూడా ఈ వ్యూహంలో భాగంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ఒక పొత్తు వెనక ఇన్ని ఎత్తులు ఉన్నాయో చూడండి..!