ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా కాలంగా ఓ సమస్య వెంటాడుతోంది. అదేమిటంటే ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు బయటకు తెలుస్తున్నాయి. జీవోలు ఆపేసినా అత్యంత నమ్మకస్తులైన వారితోనూ వ్యవహారాలు నడిపించినా బయటకు తెలుస్తున్నాయి. మీడియాలో వస్తున్నాయి. ప్రజలకు తెలిసిపోతున్నాయి. గొప్ప పారదర్శకమైన పాలన అందిస్తామన్న ప్రభుత్వ పెద్దలకు ఇది ఏ మాత్రం నచ్చడం లేదు. తెలియకూడదని ఏమి చెయాలో అన్నీ చేస్తున్నారు. చివరికి ఇప్పుడు కొత్త పద్దతిని ఫాలో అయ్యారు.
ఇక నుంచి మెసెంజర్లు వద్దు ఓన్లీ మెయిల్స్ ద్వారా సమాచారం పంపాలని చీఫ్ సెక్రటరీ ఆదేశాలిచ్చారు. ఓ జీ – మెయిల్ అకౌంట్‌ను దాని కోసం క్రియేట్ చేశారు. వాస్తవానికి ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని జీ-మెయిల్ అకౌంట్ల ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోరు. దానికి ప్రభుత్వఅధికారిక మెయిలింగ్ సిస్టం ఉంటుంది. కానీ ఎందుకో కానీ జీ-మెయిల్ ఖాతాను క్రియేట్ చేసి దానికే పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకూ మెసెంజర్ల ద్వారా పత్రాలు సీఎస్ ఆఫీసుకు వస్తున్నాయి. మెసెంజర్లు అంటే మనుషులే.వారే లీక్ చేస్తున్నారని కొత్తగా అనుమానం వచ్చింది. ఆ లీకుల్ని కట్టడి చేయడానికి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుందన్నమాట.
ఇటీవల ప్రభుత్వం రాజధాని భూముల్ని తాకట్టు పెట్టింది. అలాగే విజయవాడలో బెరం పార్క్నీ తాకట్టు పెట్టింది. ఈ నిర్ణయాలన్నీ బయటకు వచ్చాయి. ఇవన్నీ హైలీ కాన్ఫిడెన్షియల్ అని.. ఇద్దరు, ముగ్గురికి తప్ప ఎవరికీ తెలియవని కానీ ఎలా బయటకు వచ్చాయని ప్రభుత్వం ఆరా తీస్తే ఈ మెసెంజర్లు లీక్ చేశారని అనుమానపడినట్లుగా ఉంది. అందుకే అధికారిక పత్రాలు ఇక మెయిల్స్ ద్వారా పంపాలని కోరుతోంది. ప్రజాపాలన ఏదైనా పారదర్శకంగా సాగాలి కానీ ఏ మాత్రం బయటకు తెలియకుండా చేయాలన్న పట్టదలతో ఇంత గట్టి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇంతకు ముందు లేదు.. ఇక ముందు రాబోదని ఎవరైనా అనుకుంటే తప్పు పట్టాల్సిన పని లేదని ఉద్యోగులు సెటైర్లు వేసుకుంటే తప్పేం లేదు.