తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన జీవితంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటికీ ఎంతో అనుభవం ఉన్నట్లుగా చాలా సమర్ధంగా, అలవోకగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు రాష్ట్రానికి అవసరాలను బట్టి ప్రాధాన్యతలు నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులు, సమర్దులయిన మంత్రులను ఎంచుకొంటూ చాలా వేగంగా వాటిని అమలు చేస్తున్నారు. వాటిలో మిషన్ భగీరథ కూడా ఒకటి. దానిని ఆయన ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారో అందరికీ తెలుసు. మిషన్ భగీరథ పధకం గురించి ప్రకటించిన రోజునే ఆ పధకం ద్వారా వచ్చే ఎన్నికలలోగా ప్రతీ ఇంటికి మంచి నీళ్ళు సరఫరా చేయకపోతే ప్రజలను ఓట్లు అడగమని కూడా ప్రకటించారు. ఆయన ఆ పనిని సకాలంలో పూర్తి చేయగలరా లేదా? చేయలేకపోతే తన మాటకు కట్టుబడి ఎన్నికలకు దూరంగా ఉంటారా లేదా? అనే విషయాలను పక్కనబెట్టి చూసినట్లయితే, అది ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఆ విధంగా 2019 సం.గడువుగా పెట్టుకొని మొదలుపెట్టిన మిషన్ భగీరథ పధకం ఈ రెండేళ్ళలో శరవేగంగా ముందుకు సాగుతోంది. అయితే అనేక గ్రామాలలో పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్, పనుల వేగం పెంచి సకాలంలో తన లక్ష్యం చేరుకొనేందుకు ఒక వినూత్నమయిన ఆలోచన చేసారు. అదే.. దాని కోసం ప్రత్యేకంగా గ్రామీణ నీటి సరఫరా మంత్రిత్వ శాఖను సృష్టించడం. అది చాలా మంచి ఆలోచన అని చెప్పవచ్చు. ఇంతవరకు గ్రామీణ నీటి సరఫరా పనులన్నిటినీ పంచాయితీ రాజ్ శాఖ పర్యవేక్షణలో జరిగేవి. ఇప్పుడు మిషన్ భగీరథ పధకం కోసమే ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో వేగంగా నిర్ణయాలు తీసుకొని, అమలుచేయవచ్చు. తద్వారా పనులలో వేగం, పారదర్శకత రెండూ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ తన వద్దే అట్టేబెట్టుకొన్నారంటే ఈ ప్రాజెక్టుపై ఆయన ఎంత ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఈ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పధకాలకు దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల నుంచి మంచి పేరు, ప్రశంశలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడితో సహా అనేక మంది కేంద్ర మంత్రులు కూడా ఈ పధకాలను మెచ్చుకొంటున్నారంటే వాటి విశిష్టతని అర్ధం చేసుకోవచ్చు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో వ్యవసాయం, సాగు, త్రాగు నీరు, గ్రామీణాభివృద్ధి కోసం ‘వైఫి ఆలోచనలు’ చేయడం కంటే, గ్రామీణ ప్రజలకు ఎంతో మేలు చేసే ఇటువంటి పధకాలను చేపట్టి వాటి కోసం ఇటువంటి వినూత్న ఆలోచనలతో ముందుకు సాగితే మంచిదేమో.