ఏపీ ప్రభుత్వం ఉద్యోగసంఘాలతో చర్చలు జరిపి లెక్కల్లో మాయ చేసి వారిని సమ్మెకు వెళ్లకుండా చేయగలిగింది. ఆ పీఆర్సీ అంతా మాయ అని నమ్మిన వాళ్లంతా మళ్లీ పోరుబాట పడుతున్నారు. కానీ ప్రభుత్వం చర్చలు జరిపి అంగీకరించిన వాటికి సంబంధించి ఇంత వరకూ జీవోలు జారీ కాలేదు. ఉద్యోగుల్లో ఇప్పుడు అదే చర్చనీయాంశం అవుతోంది. ఉద్యోగ సంఘ నేతలు కూడా పట్టించుకోవడం లేదు. ఈ నెల 28 రోజులు కావడంతో జీతాల బిల్లులు రెడీ చేయడం ప్రారంభమయింది. ప్రతీ నెలా ఇరవై ఐదో తేదీ లోపు జీతాల బిల్లులు రెడీచేస్తారు. ఈ సారి మూడు రోజుల ముందుగానే 22వ తేదీలోపే బిల్లులు రెడీ చేయాల్సి ఉంది.
కొత్తగా అంగీకరించిన కొన్ని సవరణల ప్రకారం జీతాల బిల్లులు రెడీ చేయాలంటే అధికారిక ఉత్తర్వులు రావాలి . ఉత్తర్వులు రాకుండా అమలు చేయడం సాధ్యం కాదు. ఒక వేళ ఆ పీఆర్సీ అంశంలో సవరణలు చేస్తూ జీవో రాకపోతే గత నెల వచ్చిన జీతాలే వస్తాయి. ఆ తర్వాత జీవోలు ఇస్తారో లేదో అన్నట్లుగా పరిస్థితి మారిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే అర్థరాత్రి అయినా జీవోలు ఇచ్చేస్తుంది. క్షణాల్లో ఉత్తర్వులు ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చర్చల తర్వాత అంగీకరించిన హెచ్ఆర్ఏ మార్పు, సీసీఏ పునరుద్ధరణ వంటివి కొత్తగా ఉద్యోగులకు కలిగే మేలు.
అయితే ఇప్పుడు జీవోల్లో అత్యంత కీలకమైన అంశాలు ఉండే అవకాశం ఉంది. అది రికవరీ. ఐఆర్‌ను రికవరీ చేయబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ తొమ్మిది నెలలది మాత్రమే రికవరీ చేయబోమని మిగతాది చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. డీఏల బకాయిలతో సర్దుబాటు చేసేలా జీవో రెడీ చేస్తారని .. ఒక వేళ అది విడుదల చేస్తే మళ్లీ ఉద్యోగుల్లో ఆగ్రహం వస్తుందేమోనన్న ఉద్దేశంతో ఆగినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనబాటలో ఉన్నాయి. జీవోల తర్వాత మిగతా ఉద్యోగ సంఘాలు కలిస్తే పరిస్థితి మొదటికి వస్తుందని ఆలస్యం చేయడమో.. లేకపోతే సీక్రెట్‌గా ఉంచడమో చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.