జగనన్నకు చెబుతాం అంటూ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం హైరానా పడుతోంది. ఎప్పుడో నాలుగు నెలల కిందట ఈ ప్రోగ్రాం గురించి ఓసారి రివ్యూ చేశారు. మళ్లీ ఇప్పుడు చేశారు. దానికి గురించి పబ్లిసిటీ పీక్స్ కు వెళ్లిపోయింది. నిజానికి జగనన్న అంటే. . ఇక్కడ సీఎం .. సీఎం అంటే ఓ వ్యవస్థ. ప్రతీది సీఎంకు చెప్పుకోవడం కాదు…ఆ వ్యవస్థ సక్రమంగా పని చేయించడమే .. సీఎం పని. కానీ ఇక్కడ సీఎం తన వ్యవస్థను సరిగ్గా పని చేయించుకోలేకపోయారు. ఇక్కడ నేరుగా తనకు చెప్పుకోమని సందేశమిస్తున్నారు. మరి ఇంత కాలం పాలన ఫెయిలయినట్లేనని ఒప్పుకున్నట్లేగా..?
ప్రజల్ని కలవని ఏకైక ముఖ్యమంత్రి జగన్ !
ప్రజల సమస్యను పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన విధి. ప్రభుత్వ ఉద్యోగులంతా ఆ పనిలోనే ఉండాలి. విచిత్రంగా ఇప్పుడు ఏ స్థాయిలోనూ పనులు కావడం లేదని.. నేరుగా సీఎంకు చెప్పుకోమని ప్రభుత్వం ఆఫర్ ఇస్తోంది. ఏ ప్రభుత్వం ఉన్నా గ్రీవెన్స్ ఉంటుంది. ఈ ప్రభుత్వం స్పందన పేరుతో ఓ కార్యక్రమం పెట్టింది. అందులో కొన్ని లక్షల ఫిర్యాదులు ప్రజల నుంచి అందాయి. వాటిని నిజాయితీగా పరిష్కరించి ఉంటే.. ఇప్పుడు జగనన్నకు చెప్పుకుందా అనే కార్యక్రమం అవసరం లేదు. కానీ ఆ స్పందనను కూడా చివరికి రాజకీయ ప్రత్యర్థులపై సొంత పార్టీ నేతలతో ఫిర్యాదులు చేయించుకుని కక్ష సాధింపుల కోసం వాడుకుని వదిలేయడంతోనే సమస్య వచ్చింది.
ఇప్పుడు కూడా ఎవరూ కలవొద్దు ఫోన్లో చెప్పుకోవాలని ప్రోగ్రాం !
ప్రజలను నేరుగా కలవని ఒకే ఒక ముఖ్యమంమత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజలే తనకు బీభత్సమైన గెలుపు ఇచ్చారని వారికి అందుబాటులో ఉంటానని ఆయన చెబుతూ వస్తున్నారు కానీ సొంత ఎమ్మెల్యేలకూ అందుబాటులో లేరు. గతంలో ప్రజాదర్భార్ పెడతానని ఇంటి ముందు టెంట్ వేశారు కానీ.. పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయమని… జనం వెల్లువలా వస్తారని తేలడంతో అప్పటికప్పుడు రద్దు చేసుకున్నారు. మరోసారి అలాంటి ఆలోచన పెట్టుకోలేదు. ఇప్పుడు కూడా నేరుగా ఎవరూ రావొద్దు.. ఫోన్ లో చెప్పండి చాలు అంటూ కొత్త కార్యక్రమం పెడుతున్నారు.
ఇప్పటి వరకూ వ్యవస్థలన్నీ విఫలమే…. అంటే సీఎం విఫలమైనట్లేగా ?
ప్రజల్ని సంక్షేమ పథకాల పేరుతో మభ్య పెడితే పనులు కావు… ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని పబ్లిసిటీ చేసుకున్నంత మాత్రాన వారి సమస్యలు పరిష్కారం కావు. కావాల్సింది చిత్తశుద్ధితో పరిష్కరించడం. నాలుగేళ్లుగా ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఎన్నికలకు ముందు వ్యవస్థలన్నీ విఫలమయ్యాయని.. ఇప్పుడు సీఎంకు చెప్పుకోండి అంటే… ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లు ? వ్యవస్థలన్నీ విఫలమంటే సీఎం విఫలమయినట్లే కాదా ?