‘ఏజెంట్’ ఓ చేదు జ్ఞాపకం. ఈ సినిమాతో అనిల్ సుంకర బాగా నష్టపోయాడు. సురేందర్ రెడ్డి ఆ తరవాత సినిమానే మొదలెట్టలేదు. అఖిల్ పరిస్థితీ ఇంతే. కానీ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సాక్షి వైద్య పని మాత్రం బాగుంది. ఏజెంట్ డిజాస్టర్ ఎఫెక్ట్ ఈ అమ్మడిపై అస్సలు పడలేదు. ఏజెంట్ చేస్తున్నప్పుడే… ‘గాంఢీవధారి అర్జున’ సినిమాలో ఆఫర్ అందుకొంది. ఈ సినిమా ఈ వారంలో వస్తోంది. ఈలోగా మరిన్ని సినిమాలు ఆమె ఖాతాలో చేరాయి.
సాయిధరమ్ తేజ్ కొత్త సినిమాలో సాక్షినే కథానాయిక. ఇటీవలే క్లాప్ కొట్టుకొన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ సినిమా `ఉస్తాద్ భగత్ సింగ్`లో శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంది. ఆ ఛాన్స్ కూడా తనకే దక్కింది. దాంతో పాటు రవితేజ కొత్త సినిమాలో సాక్షిని కథానాయికగా ఎంచుకొన్నారు. అంటే.. మూడు సినిమాలు ఇప్పటికే లైన్లో ఉన్నాయన్నమాట. గాంఢీవధారి అర్జునలో సాక్షిది కాస్త సీరియస్ టైపు రోలు. తను ఐఏఎస్ అధికారిగా కనిపించనుంది. ‘ఉస్తాద్..’లో మాత్రం తనకు మంచి పాత్ర పడిందట. ”ఉస్తాద్ కోసం నన్ను సంప్రదించారు. కానీ షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు” అని ఈ సినిమాపై సాక్షి క్లారిటీ ఇచ్చేసింది.