శ్రీవారి లడ్డూల పవిత్రతను దెబ్బతీస్తూ గత పాలకమండలి వ్యవహరించిన తీరు వివాదాస్పదమయింది. ఎక్కడ పడితే అక్కడ దొరికేవి. ఎవరితో పని ఉంటే వారి దగ్గరకు లడ్డూలను భారీగా పంపేవారు. ఓ రకంగా శ్రీవరి ప్రసాదాన్ని మార్కెటింగ్ టూల్ గా గత టీటీడీ పాలకులు వాడుకున్నారు. రాజకీయ అవసరాల కోసం.. ఎవరిని ప్రసన్నం చేసుకోవాలన్నా.. టీటీడీ అధికారులే లడ్డూలతో దిగిపోయేవారు. ఇప్పుడా పరిస్థితిని మార్చేందుకు కొత్త అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
శ్రీవారి లడ్డూను అత్యంత పవిత్రంగా.. ప్రసాదంగానే ఉంచాలని.. విరివిగా దొరికే వస్తువుగా మార్చకూడదని నిర్ణయించి.. కొన్ని పరిమితులు విధించారు. ఎప్పట్లాగే దర్శన టిక్కెట్, టోకెన్ ఉన్న వారికి ఒక ఉచిత లడ్డూ ఇస్తారు. అలాగే నాలుగు నుంచి ఆరు లడ్డూలు కొనుగోలు చేయవచ్చు. ఇక దర్శనం చేసుకోని భక్తులకు ఆధార్ కార్డు చూపిస్తే రెండు లడ్డూలు ఇస్తారు. దళారులు పెద్ద ఎత్తున లడ్డూలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న ఘటనలు వెలుగు చూస్తూండటంో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఉదయం నుంచి దర్శనం చేసుకున్న వారికి ఒక్క లడ్డే ఇస్తారని మీడియాలో అతి ప్రచారం చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని పవిత్రంగా .. ఉంచాలంటే ఈ మాత్రం.. పరిమితులు విధించాలన్న అభిప్రాయం.. భక్తుల నుంచి కూడా వస్తోంది. టీటీడీ తీసుకునే చర్యలను వారు సమర్థిస్తున్నారు. ఏ భక్తుడైనా తాను తిరుమలకు వెళ్తే.. ఆరు లడ్లూ కన్నా ఎక్కువ కొనుగోలు చేయరని.. గుర్తు చేస్తున్నారు.