ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఇసుక విధానాన్ని సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి తెస్తోంది ప్రభుత్వం. ఇదే అంశమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ… మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ధరకంటే తక్కువకే ఇసుక అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ధరలు తగ్గాలంటే ఇసుక పంపిణీ పెంచాలన్నారు. ఇప్పటికే కొన్ని స్టాక్ యార్డులు గుర్తించామనీ, వీటిలో ఇసుక నిల్వను వెంటనే పెంచాలని అన్నారు. ఎక్కడ అవకాశం అక్కడ ఇసుక రీచ్ లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో ఎక్కడా తప్పులు జరిగే ఆస్కారం లేకుండా చూసుకోవాలని అధికారులకు చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో ఇసుక ఉచితం అన్నారనీ, కానీ రకరకాల పేర్లతో వసూళ్లు చేసేవారనీ అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేట్లతోపాటు, గత ప్రభుత్వం కంటే తక్కువ రేట్లకు ఇసుక అందించేలా చూడాలన్నారు. ప్రభుత్వం మంచి పని చేస్తుంటే, దాన్ని అడ్డుకుని చెడ్డ పేరు తెచ్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలకు మంచి చేస్తుంటే చూసి ఓర్వలేనివారు ఉన్నారన్నారు. కాబట్టి, ఎక్కడా ఎలాంటి అవకతవకలకి ఆస్కారం ఉండకూడదన్నారు.
నిజానికి, ఇసుక అందుబాటులో లేక నిర్మాణ రంగం వెనకబడ్డ పరిస్థితి ఏపీల ఈ మధ్య కనిపిస్తోంది. రీచ్ ల సంఖ్య గణనీయంగా తగ్గించేయడంతో, ఇసుక కొరత తీవ్రంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంది. అయితే, ఈ కొరతను చిన్న జాప్యంగా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రక్షాళన కోసమే కొద్దిపాటి జాప్యం చేయాల్సి వచ్చిందనీ, దాన్ని అవకాశంగా తీసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు కొందరు ప్రయత్నించారన్నారు. మొత్తానికి, మరో వారంలోగా ఇసుక కొరత తీరిపోయే అవకాశం ఉన్నట్టు సీఎం సంకేతాలు ఇచ్చారు. కొత్త విధానం అమల్లోకి వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.