అల్లరి నరేష్… ఈమధ్య రకరకాల జోనర్లు టచ్ చేస్తున్నాడు. సోషల్ మెజేజ్ ఉన్న కథల్ని, తనదైన కామెడీ స్టోరీల్ని సమాంతరంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మరోవైపు క్యారెక్టర్ పాత్రలకు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్షన్ మోడ్ లోకి దిగిపోయాడు. నరేష్ ‘బచ్చలమల్లి’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుబ్బు దర్శకుడు. రేపటి నుంచి మహేశ్వరంలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అక్కడ జాతర సెటప్ లో నాలుగు రోజుల పాటు ఓ కీలకమైన యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. అందుకోసం మహేశ్వరంలో ప్రత్యేకమైన సెట్ రూపొందించారు. ఫృథ్వీ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ ఫైట్ కోసం రూ.1.5 కోట్లు కేటాయించారు. నరేష్ సినిమాల్లో ఫైట్లకు పెద్ద స్కోపూ, బడ్జెట్టూ ఉండదు. కానీ ఈ ఫైట్ మాత్రం కాస్త కాస్ల్టీనే అని చెప్పుకోవాలి. టైటిల్ తోనే ఓరకమైన క్రేజ్ సంపాదించుకొన్న సినిమా ఇది. ‘ఆ ఒక్కటీ అడక్కు’ నెగిటీవ్ టాక్ తెచ్చుకొన్నా, వసూళ్లలో ఓకే అనిపించుకొంది. ‘బచ్చలమల్లి’పై కూడా ట్రేడ్ వర్గాల గురి ఉంది. ఈ సినిమాకి అప్పుడే ఓటీటీ ఆఫర్లు అందుతున్నాయి. కానీ నిర్మాత మాత్రం ఆచి తూచి అడుగులేస్తున్నారు. టీజరో, ట్రైలరో వచ్చాక ఈ సినిమాపై మరింత బజ్ పెరుగుతుందన్నది ఆయన నమ్మకం. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.