స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిబ్బందిని కొత్త ఎస్ఈసీ జస్టిస్ కనగరాజ్ ఆదేశించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారి సిబ్బందితో సమావేశమైన ఆయన.. కీలకమైన సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సర్వం సన్నద్ధంగా ఉండాలన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్య స్థాపనలో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. చివరి వ్యక్తి వరకూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరువకావాలని, స్థానిక సంస్థల ఏర్పాటు ఇందులో చాలా కీలకమన్నారు.
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా కంగారు పడకుండా.. సమాయనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను కూడా రూపొందించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉందని.. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత తదుపరి కార్యాచరణ సిద్దంచేద్దామని సూచించారు. ఎన్నికలు ఎక్కడి వరకూ వచ్చాయో.. ఎన్నికల పరిస్థితి ఏమిటో మొత్తం అధికారులు ఆయనకు వివరాలు ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం.. లాక్ డౌన్ కొనసాగించడానికి సిద్ధంగా లేదు.
రెడ్ జోన్లకే పరిమితం చేయాలని నిర్ణయించారు. రెడ్ జోన్లు మినహాయించి.. మిగతా ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. మూడు మాస్కులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కూడా ఈ కోణంలోనే అన్న ప్రచారం జరుగుతోంది. ఎస్ఈసీగా జస్టిస్ కనగరాజ్ ఉన్నప్పటికీ.. రాంసుందర్ రెడ్డిని సెక్రటరీగా నియమించారు. మొత్తం ఆయన కనుసన్నల్లోనే ఇక వ్యవహారాలు జరుగుతాయన్న ప్రచారం .. జరుగుతోంది.