రాజకీయ నాయకులు 24 గంటలూ ప్రజా సేవ చేస్తామంటారు. ఎప్పుడూ ఓట్ల వేటలో బిజీగా ఉంటారనేది మాత్రం వాస్తవం. ఎక్కడ వివాదం ఉంటుందో అక్కడ వాలిపోవడానికి సిద్ధంగా ఉంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై విద్యార్థి లోకం భగ్గుమంది. మీడియా మొత్తం దానిమీదే ఫోకస్ చేసింది. అంతే, ఎంతో మంది రాజకీయ నాయకులు ఆగమేఘాలమీద వచ్చి వాలిపోయారు. రోహిత్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.
ఇది జరిగిన కొన్ని రోజులకు, తమిళనాడు విల్లుపురం సమీపంలోని ఎస్ వి ఎస్ మెడికల్ కాలేజీలో ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది జరిగి మూడు రోజులైనా రాజకీయ నాయకులెవరూ నోరు మెదపలేదు. పనిగట్టుకుని అక్కడి వెళ్లడం కాదుగదా, కనీసం మీడియా ముందుకు వచ్చి ఈ దారుణ ఘటనకు బాధ్యులు శిక్షించాలని డిమాండ్ చేసిన పాపాన పోలేదు. కారణం, ఈ ముగ్గురు అమ్మాయిలు దళితులు కాదనే అభిప్రాయం కావచ్చు.
హైదరాబాద్ లో ఒక్క విద్యార్థి ఆత్మహత్యపై అంతగా స్పందించిన వారు, ముగ్గురి ఆత్మహత్య ఘటనపై ఎందుకు స్పందించ లేదు? రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తోపాటు వివిధ పార్టీల నాయకులు సెంట్రల్ యూనివర్సిటీకి క్యూ కట్టారు. వీళ్లలో ఎంత మందికి నిజంగా ఆ విద్యార్థి మరణంపై బాధ ఉందో గానీ, చాలా మంది ఓటు బ్యాంకు రాజకీయంలో భాగంగా ఓ రాజకీయ జాతర జరిపారని అందరికీ తెలుసు.
ఆత్మహత్యకు ముందు రోహిత్ రాసిన లేఖలో ఎవరి పేర్లూ లేవు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని రాశాడు. అయినా పరామర్శ యాత్రకు వచ్చిన వారు అధికార పార్టీకి చెందిన చాలా మందిపై విమర్శలనే రాళ్లు రువ్వారు. ఆ లేఖలో ప్రధాని పేరుగానీ, మంత్రుల పేర్లు గానీ, వీసీ పేరు గానీ లేదు. అయినా సరే ప్రధాని నరేంద్ర మోడీ నుంచి వైస్ చాన్స్ లర్ వరకూ వీరందరినీ ఎడా పెడా తిట్టేశారు. దళితుడు కాబట్టి ఆమాత్రం రెస్పాన్స్ ఉంటే ఆ వర్గం ఓట్లు గ్యారంటీ అనే స్కెచ్ వేసి వచ్చిన ఈ ఓట్ల వేటగాళ్లు ట్రాజెడీ సీన్ ను బాగానే రక్తికట్టించారు.
విల్లుపరంలో పరిస్థితి వేరు. ముగ్గుర విద్యార్థినులూ తమ ఆత్మహత్యకు కారణం ఏమిటో లేఖలో రాశారు. తమ చావుకు బాధ్యులు ఎవరో స్పష్టంగా తెలిపారు. కాలేజీ చైర్ పర్సన్ పెట్టే టార్చర్ ను భరించ లేకే ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలిపారు. అంతేకాదు, చైర్ పర్సన్ వ్యక్తిత్వం ఎలాంటిదో స్పష్టంగా వివరించారు. ఇంత జరిగినా బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసే బాధ్యత రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ తో పాటు కాంగ్రెస్ వారికి, కమ్యూనిస్టులకు ఇతర పార్టీ పార్టీల వారికి లేకపోయింది. ఆ అమ్మాయిల కులం ఏమిటో అక్కడి మీడియా రాయలేదు. కేవలం వారి ఆవేదన, ఆక్రోశాన్ని, విద్యార్థుల ఆందోళనను కవర్ చేస్తోంది. అందుకే, వారు దళితులు కాదేమో అనే ఉద్దేశంతోనే కుహనా సామ్యవాద, ప్రజాస్వామిక వాద నాయకులు అటు వైపు కన్నెత్తి చూడలేదేమో.
ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. అందులోనూ ఎవరో వేధిస్తే ఆత్మహత్య చేసుకున్నారని తెలిసినప్పుడు తీవ్రంగా స్పందించాల్సిందే. కానీ మన దేశంలోని రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాల్లోనూ తేడాలు చూపిస్తున్నారు. దళితులు, మైనారిటీల విషయంలో మాత్రమే స్పందించాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. ఏం చేస్తాం !!