కొత్త పిట్ట వచ్చి వాలిందంటే చాలు, అందరి కళ్లు అటే తిరుగుతాయి. ఇది నైజం. అందునా ఈ పిట్ట అలాంటిది ఇలాంటిది కాదండి. కోకిలలాగా పాగా పాడుతుంది. ఇలాంటి పాడే పిట్టలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి కొత్త పిట్ట ఒకటి ఈశాన్యదేశంలో అందునా, అరుణాచల్ ప్రదేశ్ లో బాగా కనబడుతోంది. ఈ పిట్ట పేరు హిమాలయన్ ఫారెస్ట్ థ్రస్ (పాటలు పాడే హిమాలయ పక్షి) దీని శాస్త్రీయ నామం – Zoothera salimalii.
2004లో తీసిన లెక్కల ప్రకారం మనదేశంలో 1180 జాతుల పక్షులున్నాయి. ప్రపంచదేశాల్లో పోలిస్తే మనదేశం ఈ రకంగా 9వ స్థానంలో గర్వంగా నిలబడింది. పక్షుల జీవజాతుల వైవిధ్యానికి ఈశాన్యంలోని అరుణాచల్ ప్రదేశ్ పెట్టిందిపేరు. చైనా సరిహద్దున ఉండే ప్రాంతంలో ఈ పక్షిజాతులు కనిపించాయి. భారతదేశంలోని పక్షిజాతుల అధ్యయనవేత్తలతో పాటుగా స్వీడన్, చైనా, అమెరికా, రష్యాలోని శాస్త్రవేత్తలు కూడా కలిసి ఒక బృందంగా ఏర్పడి ఈ జాతి పక్షులపై అధ్యయనం చేశారు. భారతీయ ప్రముఖ ఆర్నిథాలజిస్ట్ డాక్టర్ సలీం అలీ పేరునే జాతి నామంగా ఖరారుచేయడం విశేషం. డాక్టర్ సలీం అలీ 1987 వరకు అనేక పక్షి జాతులపై అధ్యయనం చేశారు. ఆయన పేరిట పక్షిజాతి నామకరణం జరగడం ఇదే మొదటిసారి. ఈ పక్షిని మొట్టమొదటిసారిగా 2009 సమ్మర్ లో గుర్తించారు. ఇదే జాతికి దగ్గర్లో మరో పక్షి జాతి ఉంది. దానిపేరు Zoothera mollissima.
వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, రేడియోషన్ ప్రభావం వంటి కారణాల వల్ల అనేక చోట్ల పక్షిజాతి మనుగడే కష్టమవుతోంది. ఉన్న పక్షి జాతులే అంతరించే ప్రమాదం ముంచుకొచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కొత్త పక్షిజాతి కనిపించడం నిజంగా సంబరమే. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. 2000 సంవత్సరం నుంచి ప్రతిఏటా సగటున ఓ ఐదు కొత్త జాతులను మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఈ ఆవిష్కరణలు కూడా ఎక్కువగా దక్షిణ అమెరికాలోనే చోటుచేసుకుంటున్నాయి. ఇక మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగు కొత్త పిట్టజాతులను మాత్రమే గుర్తించగలిగారు. అందులో ఈ హిమాలయన్ ఫారెస్ట్ థ్రస్ పిట్ట చివరది కావడం గమనార్హం. అందుకే ఈ కొత్త పిట్టకు స్వాగతం చెబుదాం. దాని పాటలు వింటూ మైమరచిపోదాం.