అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం.. సింగపూర్ కన్సార్షియంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని… ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఐదు నెలల నుంచి… ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. పలుమార్లు సింగపూర్ సర్కార్ కూడా… స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సిద్ధంగా ఉన్నామని… ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రకటనలు కూడా చేసింది. ఈ క్రమంలో… ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేస్తే.. ఏపీ కన్నా.. సింగపూర్ సంస్థలకే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని.. ఏపీ సర్కార్ నిర్ణయానికి వచ్చింది.
సింగపూర్ కన్సార్షియంతో రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎస్పీవీలో సింగపూర్ కన్సార్షియానికి 58 శాతం, ఏడీసీకి 42 శాతం వాటా ఉంటుంది. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్న ఏపీ సర్కార్.. రూ. మూడు, నాలుగు వందల కోట్ల వరకూ పరిహారాన్ని సింగపూర్ కన్సార్షియానికి చెల్లించాల్సి రావొచ్చన్న అంచనాలున్నాయి. ఇప్పటి వరకూ.. ఒప్పందం ప్రకారం… తాము చేసిన పనులన్నింటికీ అయిన ఖర్చులను.. ఏపీ సర్కార్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు పరస్పర అంగీకారయోగ్యమైతేనే.. ఒప్పందం రద్దవుతుంది. లేకపోతే.. ఏపీ సర్కార్ పై.. అంతర్జాతీయ కోర్టుల్లో కేసులు పడే ప్రమాదం ఉంది. మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేసేందుకు అనుసరించిన స్విస్ చాలెంజ్ విధానంపై వైసీపీ వ్యతిరేకతతో ఉంది. కోర్టుల్లో కూడా కేసులు నడుస్తున్నాయి. గత వాయిదాలో… హైకోర్టు.. ప్రభుత్వంపై.. ఈ విషయంపైనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
కృష్ణానదీ తీరాన, సీడ్ యాక్సెస్ రహదారికి పక్కన, ప్రభుత్వ కార్యకలాపాలన్నింటికీ నెలవుగా నిలవనున్న గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు అత్యంత చేరువలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి గత ప్రభుత్వం ప్రతిపాదించింది. 1691ఎకరాల్లో అభివృద్ధి చేయదలచిన ఈ స్టార్టప్ ఏరియాను 3 దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. తొలిదశగా మూడేళ్లలో 656ఎకరాలు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పరచి, 8.07లక్షల చ.అ. బిల్డింగ్ స్పేస్ సృష్టించి, అందులో తమ శాఖలు- కార్యాలయాలు స్థాపించేలా సుప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించాలని ప్రణాళికలు రచించారు. ఇవన్నీ ఉపయోగం లేనివిగా గుర్తించిన ఏపీ సర్కార్… ఆపేస్తోంది.