ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. ఆర్.ఆర్.ఆర్ తరవాత రామ్ చరణ్ చేసిన సినిమా ఇది. అభిమానులు ఎంతగానో ఆశగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఏమాటకామాట చెప్పుకోవాలి. గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన స్టఫ్ వాళ్లని మెప్పించలేకపోయింది. టీజరో, ట్రైలరో వస్తే కానీ, ఈ సినిమాపై గురి కుదరదు. ఈ విషయం దిల్ రాజు అండ్ టీమ్ కి కూడా తెలుసు. అందుకే ఇక మీదట ప్రమోషన్లని కాస్త ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయాలని చూస్తున్నారు.
టీజర్ ఇప్పటికే కట్ చేసి పెట్టారు. మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబరులో కానీ, జనవరి మొదటి వారంలో కానీ ట్రైలర్ వదులుతారు. ఈలోగా మరిన్ని ఇంట్రస్టింగ్ కంటెంట్స్ బయటకు వదలాలని చూస్తున్నారు. రామ్ చరణ్ తన తదుపరి సినిమా బుచ్చిబాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు, చరణ్ మధ్య ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. ఆ ఇంటర్వ్యూ ఓ మంచి అకేషన్ చూసి విడుదల చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమాలోని ఓ యాక్షన్ ఎపిసోడ్ ని ముందుగా చూపించే ఆలోచన కూడా ఉంది. పెద్ద హీరోల సినిమాలకు టీజర్లు, ట్రైలర్లు కట్ చేస్తారు కానీ, ఓ ఎపిసోడ్ మొత్తం ముందే చూపించడం కష్టం. అయితే ‘గేమ్ ఛేంజర్’ కోసం అలాంటి ప్రయత్నమేదో చేస్తున్నారని ఇన్ సైడ్ వర్గాల టాక్. డిసెంబరు నుంచే బాలీవుడ్ ప్రమోషన్లు మొదలెట్టాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. చివర్లో ఆదరా బాదరగా ప్రమోషన్లు చుట్టేయకుండా అంతా పకడ్బందీగా జరగాలన్నది ఆయన ప్రయత్నం. ‘దేవర’ ప్రమోషన్లు అనుకొన్నంత ఆశాజనకంగా సాగలేదు. అసలు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్లే జరగలేదు. ఆ తప్పు… ‘గేమ్ ఛేంజర్’ విషయంలో జరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ దీపావళి నుంచే ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్ ప్లానింగ్ అమలయ్యే అవకాశాలు ఉన్నాయి.